రూ.1500 కోట్లతో విస్తరణ - Expansion with Rs.1500 crore
close

Updated : 12/06/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.1500 కోట్లతో విస్తరణ

వచ్చే అయిదేళ్లలో 5,000 పడకల సామర్థ్యం
చెన్నై, బెంగళూరుల్లో కొత్త ఆసుపత్రులు
కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.భాస్కరరావు
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌) పెద్దఎత్తున విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే అయిదేళ్లలో 5,000 ఆసుపత్రి పడకల సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ.1500 కోట్ల వరకు పెట్టుబడి అవసరం. కొన్ని ఆసుపత్రులను కొనుగోలు చేయడంతో పాటు మరికొన్ని కొత్త ఆసుపత్రులు నెలకొల్పడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.భాస్కరరావు ‘ఈనాడు’ కు వెల్లడించారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌ ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం 9 ఆసుపత్రులు, 3064 పడకలు ఉన్న ఈ సంస్థ త్వరలో చెన్నై, బెంగళూరు నగరాలకు విస్తరించనుంది. ఈ రెండు నగరాల్లో 250- 300 పడకల సామర్థ్యం గల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో ఒక్కో ఆస్పత్రి సామర్థ్యాన్ని 700- 800 పడకాలకు పెంచాలనే ఆలోచన ఉందని భాస్కరరావు తెలిపారు. చెన్నైలో స్థలం ఎంపిక, అనుమతుల కోసం దరఖాస్తు చేయడం పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పడకలను ఇంకా పెంచుకుంటామని వివరించారు.
సగం వరకు సొంత నిధులే
విస్తరణ కార్యకలాపాలకు అయ్యే సొమ్ములో సగం వరకు సొంత నిధులే ఖర్చు చేస్తామని భాస్కరరావు తెలిపారు. మిగతా సగానికి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటామన్నారు. ఒకేసారి నిధులు సేకరించాల్సిన పనిలేదని, ఏటేటా కొంత సమీకరిస్తే సరిపోతుందని వివరించారు. గత దశాబ్ద కాలానికి పైగా తాము 20 శాతం చొప్పున వార్షిక వృద్ధి నమోదు చేశామని, ఇదే స్థాయి వృద్ధిని భవిష్యత్తులోనూ కొనసాగించాలనేది తమ ఉద్దేశమని చెప్పారు.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కొవిడ్‌-19 రెండోదశకు సన్నద్ధంగా లేకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులోనూ మళ్లీ ఇటువంటి పరిస్థితి వస్తే, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్‌ సదుపాయాలు, వైద్యులు- సిబ్బంది నియామకాలు, పిల్లల వార్డుల ఏర్పాటు.. వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నందున, సంబంధిత విభాగాల్లో అధునాతన చికిత్సలు అందించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 16 నుంచి పబ్లిక్‌ ఇష్యూ
కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఈక్విటీ షేర్ల తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 16న ప్రారంభమై 18న ముగియనుంది. బుక్‌బిల్డింగ్‌ పద్ధతిలో ఒక్కో షేరుకు రూ.815 నుంచి రూ.825 ధర నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.200 కోట్లు సమీకరిస్తోంది. ఇదేగాక ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు కలిపి 2,35,60,538 షేర్లు విక్రయిస్తున్నారు. ఇందులో జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ కేహెచ్‌ పీటీఈ లిమిటెడ్‌ 1,60,03,615 షేర్లు విక్రయిస్తోంది. దీని ప్రకారం చూస్తే, ఇది దాదాపు రూ.2,150 కోట్ల ఇష్యూ అవుతోంది. కంపెనీకి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా లభించే రూ.200 కోట్ల నుంచి రూ.150 కోట్లతో అప్పు తీర్చనున్నట్లు డాక్టర్‌ భాస్కరరావు వెల్లడించారు.  మిగిలిన రూ.50 కోట్ల కార్పొరేట్‌ అవసరాలకు, భాగస్వామ్యాలు- ఇతర అవసరాలకు కేటాయిస్తారు.

కొవిడ్‌తో రుణ వసూళ్లు కష్టమే
ఎంఎఫ్‌ఐల ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి
క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక

ముంబయి: కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐలు) జారీ చేసిన రుణాల వసూళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక వెల్లడించింది. చాలా సంస్థలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని, 30 రోజులకు పైగా వసూలు కాని రుణాలు ఈనెలలో 14-16 శాతానికి చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. మార్చిలో ఇలాంటి రుణాలు 6-7 శాతం మాత్రమే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం 2017 మార్చిలో ఇలాంటి రుణాల శాతం 11.7 శాతంగా నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది రుణ మారటోరియం అవకాశం లేనందున, చాలా ఎంఎఫ్‌ఐలు గత నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచించిన పరిష్కార ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ప్రకారం రుణ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి ఇస్తున్నాయని పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని