ఈక్విటీ మార్కెట్లోకి రూ.2.74 లక్షల కోట్ల ఎఫ్‌పీఐలు - FPIs invests nearly Rs 3 lakh cr in equity markets
close

Updated : 06/04/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈక్విటీ మార్కెట్లోకి రూ.2.74 లక్షల కోట్ల ఎఫ్‌పీఐలు

దిల్లీ: కొవిడ్‌ ప్రభావం ఉన్నప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సంలో భారత ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఎఫ్‌పీఐల ద్వారా మొత్తం రూ.2,74,034 కోట్లు పెట్టుబడులుగా వచ్చి చేరినట్లు తెలిపింది. విదేశీ మదుపర్లకు భారత ఆర్థిక వ్యవస్థ మూలాలపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొంది.

ఏడాది మొత్తంలో ఏప్రిల్‌లో నికరంగా రూ.6,884 కోట్లు, సెప్టెంబరులో రూ.7,783 కోట్ల ఎఫ్‌పీఐలు తరలివెళ్లాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా తీసుకొచ్చిన ఉద్దీపన చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా పుంజుకుందని.. ఇదే ఎఫ్‌పీఐల వెల్లువకు ప్రధాన కారణమని కేంద్రం అభిప్రాయపడింది. అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వంతో పాటు వివిధ ఆర్థిక సంస్థలు తీసుకున్న చర్యలు మదుపర్ల విశ్వాసాన్ని పెంచాయని తెలిపింది.

ఎఫ్‌పీఐ రెగ్యులేటరీ నిర్వహణను హేతుబద్ధీకరిస్తూ మరింత సరళీకరించడం, సెబీ వద్ద రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ కామన్ అప్లికేషన్ ఫారం(సీఏఎఫ్) కార్యాచరణను తీసుకురావడం, పాన్ కేటాయింపు, బ్యాంక్‌, డీమ్యాట్‌ ఖాతాలను తెరవడం మొదలైన చర్యలు ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయని కేంద్రం తెలిపింది. భారతీయ కంపెనీలలో మొత్తం ఎఫ్‌పీఐల పెట్టుబడి పరిమితిని 24 శాతం నుంచి సెక్టోరల్ క్యాప్‌కు పెంచడం ప్రధాన ఈక్విటీ సూచీల్లో భారతీయ సెక్యూరిటీల బలోపేతానికి దోహదం చేసిందని వివరించింది. తద్వారా భారత మూలధన మార్కెట్లోకి  ఈక్విటీ పెట్టుబడుల‌ ప్రవాహం కొనసాగిందని పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని