ప్యాకేజ్డ్‌ తాగునీటికి బీఐఎస్‌ తప్పనిసరి - FSSAI makes BIS certification mandatory for packaged drinking water cos
close

Published : 27/03/2021 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్యాకేజ్డ్‌ తాగునీటికి బీఐఎస్‌ తప్పనిసరి

దిల్లీ: ప్యాకేజ్డ్‌ తాగునీరు, మినరల్‌ వాటర్‌ తయారీ సంస్థలు లైసెన్స్‌ పొందేందుకు/తమ వద్ద నమోదుకు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) మార్క్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేసినట్లు ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ) శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార భద్రత కమిషనర్లకు ఈ మేరకు లేఖ రాసింది. 2021 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అందులో తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ చట్టం-2008 సెక్షన్‌ 31 ప్రకారం, ఆహార వ్యాపార నిర్వాహకులు (ఎఫ్‌బీఓలు) వ్యాపారం ప్రారంభించడానికి ముందు లైసెన్స్‌/ధ్రువీకరణ కచ్చితంగా తీసుకోవాలి. ఆహార భద్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, పరిమితి) నిబంధనలు-2011 ప్రకారం, బీఐఎస్‌ ధ్రువీకరణ లేకుండా ఏ వ్యక్తి కూడా ప్యాకేజ్డ్‌ తాగు నీటిని, మినరల్‌ వాటర్‌ను విక్రయించకూడదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ప్రస్తుతం  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌తోనే కొందరు తయారీదార్లు ప్యాకేజ్డ్‌ తాగునీరు, మినరల్‌ వాటర్‌ వ్యాపారం కొనసాగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ పునరుద్ధరణకు దరఖాస్తు చేసేటపుడు బీఐఎస్‌ లైసెన్స్‌ తప్పనిసరి అని వివరించింది.
* స్టాండింగ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (స్కోప్‌) కొత్త ఛైర్మన్‌గా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ఛైర్మన్‌ సోమా మండల్‌ ఎన్నికయ్యారు. ఈమె 2021 ఏప్రిల్‌ 1 నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
* బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) చివరి రోజు ఇష్యూ ముగిసే సరికి 5.98 రెట్ల స్పందన లభించింది.
* రాజస్థాన్‌లోని బార్మర్‌ చమురు క్షేత్రం నుంచి వేదాంతా ఉత్పత్తి చేస్తున్న చమురు లాభాల్లో 10 శాతం అదనపు వాటాను కేంద్రం డిమాండ్‌ చేయవచ్చని దిల్లీ హైకోర్టు పేర్కొంది.
* దేశ విదేశీ మారకపు నిల్వలు ఈ నెల 19తో ముగిసిన వారానికి 23.3 కోట్ల డాలర్ల మేర పెరిగి, 58,227.1 కోట్ల డాలర్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని