అదానీతో ఫ్లిప్‌కార్ట్‌ వాణిజ్య భాగస్వామ్యం - Flipkarts commercial partnership with Adani
close

Published : 13/04/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదానీతో ఫ్లిప్‌కార్ట్‌ వాణిజ్య భాగస్వామ్యం

2,500 మందికి ఉద్యోగాల కల్పన

దిల్లీ: అదానీ గ్రూప్‌తో వాణిజ్య భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. తమ లాజిస్టిక్స్‌, డేటా సెంటర్‌ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. 2,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ అనుబంధ సంస్థ అయిన అదానీ లాజిస్టిక్స్‌తో కలిసి ఫ్లిప్‌కార్ట్‌ పని చేయనుంది. సరఫరా మౌలిక వసతుల్ని బలోపేతం చేసుకుని, వేగంగా వృద్ధి చెందుతున్న తమ ఖాతాదార్లకు సేవలు ఇంకా మెరుగు పరుస్తామని ఫ్లిప్‌కార్ట్‌ వివరించింది. చెన్నైలోని అదానీకనెక్స్‌లో మూడో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అదానీకనెక్స్‌ అనేది ఎడ్జ్‌కనెక్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు ఏర్పాటు చేసిన కొత్త సంయుక్త సంస్థ. భాగస్వామ్యానికి సంబంధించిన ఆర్థిక వివరాలేవీ ఇంకా వెల్లడి కాలేదు.
రెండు సంస్థల మధ్య కుదిరిన వాణిజ్య భాగస్వామ్యంలో భాగంగా అదానీ లాజిస్టిక్స్‌ 5.34 లక్షల చదరపు అడుగుల గిడ్డంగిని (ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రం-వేర్‌హౌస్‌) ఫ్లిప్‌కార్ట్‌ కోసం ముంబయిలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న లాజిస్టిక్స్‌ హబ్‌లో నిర్మించి ఇవ్వనుంది.
సరఫరా మౌలిక వసతుల్ని బలోపేతం చేసి ఎంఎస్‌ఎంఈలు, విక్రేతలకు మద్దతు ఇచ్చేందుకు వీలుగా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఫ్లిప్‌కార్ట్‌ భావిస్తోంది. 2,500 మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించాలనుకుంటున్నట్లు తెలిపింది.

ప్రయాణికుల వాహన విక్రయాలు తగ్గాయ్‌
2020-21పై సియామ్‌  

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2002-21)లో భారత్‌లో ప్రయాణికుల వాహన విక్రయాలు 2.24 శాతం తగ్గి 27,11,457 యూనిట్లుగా నమోదయ్యాయని పరిశ్రమ సంఘం సియామ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. 2019-20లో వాహన అమ్మకాలు 27,73,519 యూనిట్లుగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా నెమ్మదించిన వాహన పరిశ్రమపై కొవిడ్‌-19 సంక్షోభం ప్రభావం చూపిందని పేర్కొంది. ఇక 2020-21లో డీలర్లకు కంపెనీలు పంపిన మొత్తం ద్విచక్రవాహనాలు 1,51,19,387 మాత్రమే. 2019-20 నాటి 1,74,16,432 వాహనాలతో పోలిస్తే, ఇవి 13.19 శాతం తక్కువ. ఇదే సమయంలో  వాణిజ్య వాహన విక్రయాలు 7,17,593 నుంచి 20.77 శాతం తగ్గి 5,68,559 కు పరిమితమయ్యాయి. తిచక్రవాహన అమ్మకాలు సైతం 6,37,065 నుంచి 66.06 శాతం క్షీణించి 2,16,197 యూనిట్లకు పడిపోయాయి. అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు 2,15,45,551 నుంచి 13.6 శాతం తగ్గి 1,86,15,188కు చేరాయి.
మార్చిలో ఇలా: 2021 మార్చిలో దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు 2,90,939 కు పెరిగాయి. 2020 మార్చిలో ఇవి 1,35,196 గా ఉన్నాయి. ఇదే సమయంలో డీలర్లకు పంపిన ద్విచక్రవాహనాలు 8,66,845 నుంచి 14,96,806 కు వృద్ధి చెందాయి. మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 5,70,858 నుంచి 9,93,996కు చేరాయి. స్కూటర్‌ విక్రయాలు సైతం 2,63,070 నుంచి 4,57,677కు పెరిగాయి. అన్ని వాహన విభాగాల్లో కలిపి అమ్మకాలు 10,29,518 నుంచి 18,19,682కు చేరాయి. గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌ వల్ల వాహన అమ్మకాలు గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని