దేశంలో 4 కోట్ల డొక్కు వాహనాలు! - Four crore old vehicles in the country
close

Updated : 28/03/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో 4 కోట్ల డొక్కు వాహనాలు!

వీటిపై హరిత పన్ను విధించే యోచనలో కేంద్రం
అందుబాటులో లేని తెలుగు రాష్ట్రాల వివరాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డొక్కు వాహనాలు ఉన్నట్లు లెక్క తేలింది. వీటిలో దాదాపు 70 లక్షల వాహనాలు ఒక్క కర్ణాటకలోనే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వివరాలను డిజిటలైజ్‌ చేసింది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌, లక్షద్వీప్‌ వివరాలు అందుబాటులో లేవు. 

15 ఏళ్ల పైబడిన వాహనాలను డొక్కు వాహనాల కింద పరిగణిస్తారు. వీటి వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. దీంతో వీటి వాడకాన్ని తగ్గించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తీసుకొచ్చిందే ‘స్వతంత్ర వాహన తుక్కు విధానం’. అలాగే ఇలాంటి పాత వాహనాలపై హరిత పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపినట్లు సమాచారం.

నాలుగు కోట్ల పాత వాహనాల్లో రెండు కోట్లు 20 ఏళ్ల పైబడినవి కూడా ఉన్నట్లు కేంద్రీకృత వాహన్‌ డేటాబేస్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో 70 లక్షల పాత వాహనాలతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌ 56.64 లక్షలు(24.55 లక్షలు 20 ఏళ్లు పైబడినవి), దిల్లీ 49.93 లక్షలు (35.11 లక్షలు 20 ఏళ్లు పైబడినవి) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే కేరళలో 34.64 లక్షలు, తమిళనాడులో 33.43 లక్షలు, పంజాబ్‌లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో రూ.22.69 లక్షల పాత వాహనాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణాలో పాత వాహనాల సంఖ్య 17.58 లక్షలు నుంచి 12.29 లక్షల మధ్య.. ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, అసోం, బిహార్‌, గోవా, త్రిపుర, దాద్రా నగర్‌ హవేలీ, దామణ్‌ దీవ్‌లో ఒక లక్ష నుంచి 5.44 లక్షల మధ్య ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో డొక్కు వాహనాల సంఖ్య లక్ష కంటే తక్కువే ఉన్నాయి. 

కాలుష్యానికి కారణమయ్యే ఈ వాహనాలన్నింటిపై హరిత పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. హైబ్రిడ్‌, విద్యుత్తు, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ వంటి ఇంధనాలతో నడిచే వావహనాలకు పన్ను నుంచి మినహాయింపునివ్వనున్నారు. హరిత పన్ను కింద వసూలయ్యే ఆదాయంతో కాలుష్య నివారణ చర్యలు చేపట్టనున్నారు.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని