హైకోర్టు ఆదేశాలపై ‘ఫ్యూచర్‌ గ్రూప్‌’ సవాల్‌ - Future Group moves division bench of Delhi High Court
close

Published : 21/03/2021 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైకోర్టు ఆదేశాలపై ‘ఫ్యూచర్‌ గ్రూప్‌’ సవాల్‌

దిల్లీ: ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఫ్యూచర్‌ గ్రూప్‌ శనివారం దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. సింగపూర్‌ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌(ఈఏ) ఆదేశాలను సమర్థిస్తూ రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఫ్యూచర్‌ రిటైల్‌కు దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తీర్పును సవాల్‌ చేస్తూ ఫ్యూచర్‌ రిటైల్, ఫ్యూచర్‌ కూపన్స్‌ అదే కోర్టులోని ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. తాజాగా దాఖలు చేసిన అప్పీలును చీఫ్‌ జస్టిస్‌ డి.ఎన్‌. పటేల్, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ఉన్నత ధర్మాసనం మార్చి 22న విచారించనుంది. అయితే, ఏకసభ్య ధర్మాసనం తీర్పు ప్రభావం ప్రస్తుతం ‘నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)‌’ ముందు ఉన్న సర్దుబాటు పథకంపై ఉండబోదని ఫ్యూచర్‌ గ్రూప్‌ చెప్పుకొచ్చింది.

ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇదీ...

రిలయన్స్‌ గ్రూప్‌తో కుదిరిన రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని నిలిపివేయాలని దిల్లీ హైకోర్టు గురువారం కిశోర్‌ బియానీ నేతృత్వంలోని రిటైల్ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సింగపూర్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఫ్యూచ‌ర్స్ రిటైల్  ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందని అభిప్రాయపడింది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వయోజనులకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వీలుగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.20 లక్షల నగదు అందజేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లను కోర్టు ఆదేశించింది. సీఈవో కిశోర్ బియానీ, ఇత‌రుల ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వ‌చ్చేనెల 28వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కిశోర్ బియానీ, త‌దిత‌రుల‌ను ఆదేశించింది. అలాగే, మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు 3 నెలల జైలు శిక్ష ఎందుకు విధించకూడదో కూడా తెలపాలని కోరింది.

వివాదం ఇదీ...

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది. దీంతో సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. కోర్టు దీనిపై స్టే విధించింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.

ఇవీ చదవండి..

టెలికాం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే!

జనవరిలో కొత్తగా 13.36 లక్షల ఉద్యోగాలు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని