జీపీఎస్‌ కమీషన్లు వెనక్కి ఇచ్చేస్తాం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ - GPS commissions will be refunded to HDFC Bank
close

Published : 18/06/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీపీఎస్‌ కమీషన్లు వెనక్కి ఇచ్చేస్తాం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ముంబయి: వాహన రుణ గ్రహీతల నుంచి వసూలు చేసిన వివాదాస్పద ‘జీపీఎస్‌ డివైజ్‌ కమీషన్‌’ను  వెనక్కి ఇచ్చేయబోతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గురువారం ప్రకటించింది. వాహన రుణాలపై  నిర్దిష్ట ఆరోపణలు వెల్లువెత్తడంతో బ్యాంక్‌ అప్పటి సీఈఓ ఆదిత్య పురి ‘గత ఏడాది తమ బృందం వాహన రుణ పంపిణీలో అక్రమాలకు పాల్పడిన’ట్లు అంగీకరించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది ప్రారంభంలో ఈ విషయంలో బ్యాంకుకు రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. దీంతో జీపీఎస్‌ డివైజ్‌ కమీషన్‌ వెనక్కి ఇస్తున్నట్లు బ్యాంక్‌ తెలియజేసింది. 2013-14 నుంచి 2109-20 మధ్య కాలంలో వాహన రుణాలు (జీపీఎస్‌ డివైజ్‌ భాగంగా ఉంటే) తీసుకున్న ఖాతాదార్లకు జీపీఎస్‌ డివైజ్‌ కమీషన్‌ తిరిగి ఇవ్వనుంది.
* కొత్త క్రెడిట్‌ కార్డ్‌ అమ్మకాలపై నియంత్రణ నిషేధానికి దారి తీసిన నెట్‌వర్క్‌ వైఫల్యాలు.. లావాదేవీల పరిమాణం వల్ల జరిగినవి కాదని, దీనిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో (ఆర్‌బీఐ) సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ సేవలను ఎప్పుట్నుంచి పునఃప్రారంభిస్తామనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది. నెట్‌వర్క్‌ వరుస వైఫల్యాలతో 2020 డిసెంబరులో కొత్త క్రెడిట్‌ కార్డ్‌లు మంజూరు చేయొద్దని, కొత్త డిజిటల్‌ సేవలను ఆరంభించొద్దని ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ములు రూ.20,700 కోట్లకు

దిల్లీ/జ్యూరిచ్‌: స్విస్‌ బ్యాంకుల్లో భారత శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా భారత వ్యక్తులు, సంస్థలు పెట్టిన సొమ్ములు 2020లో 2.55 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంకుల (దాదాపు రూ.20,700 కోట్లకు పైగా)కు చేరాయి. సెక్యూరిటీలు, ఇతర పెట్టుబడుల విలువ గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. అయితే వినియోగదారుల డిపాజిట్లు వరుసగా రెండో ఏడాది తగ్గాయని స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకు వార్షిక గణాంకాలు స్పష్టం చేశాయి. 2019 చివరకు స్విస్‌ బ్యాంకుల్లో భారత ఖాతాదారుల సొమ్ములు 899 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంకులు (రూ.6625 కోట్లుగా)గా ఉన్నాయి. రెండేళ్ల పాటు తిరోగమన ధోరణిలో ఉన్న విలువ గతేడాది పెరగడంతో పాటు 13 ఏళ్లలోనే గరిష్ఠ స్థాయికి చేరింది. 2006లో ఈ మొత్తం రికార్డు గరిష్ఠమైన 6.5 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంకులుగా నమోదైంది. ఆ తర్వాత 2011, 2013, 2017 సంవత్సరాల్లో మినహా పెట్టుబడుల విలువ తిరోగమనంలోనే ఉన్నట్లు స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ గణాంకాలు చెబుతున్నాయి.
 

పట్టణ సహకార బ్యాంకుల నుంచీ ఏటీఎం, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలకు వీలు

బెంగళూరు: పట్టణ సహకార బ్యాంకులు కూడా ఏటీఎంలు, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు వీలు కానుంది. ఇందుకు ఉపయోగపడే డిజిటల్‌ బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ను పట్టణ సహకార బ్యాంకులకు అందిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ అనుబంధ ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌ ప్రకటించింది. ఇప్పటికే 3 బ్యాంకులకు అందించామని వెల్లడించింది. ఫినాకిల్‌ కోర్‌ బ్యాంకింగ్‌తో పాటు ఎస్‌ఐపీఎల్‌ నుంచి అదనపు సేవలు కూడా లభిస్తాయని పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని