close

తాజా వార్తలు

జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్రానికి తప్పని రాష్ట్రాల సెగ..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ వాడీవేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌ 18న జరిగే ఈ మీటింగ్‌లో వివిధ అంశాలను లేవనెత్తాలని భాజపా పాలనేతర రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం ఈ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు భేటీ అయి కౌన్సిల్‌ మీటింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కౌన్సిల్‌లో రాష్ట్రాలకు పరిహారం అంశాన్ని చర్చకు తీసుకోకపోతే వాకౌట్‌ చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఈ సారి జీఎస్‌టీ రేట్ల పునఃపరిశీలన అంశం మరుగున పడుతుంది.

కేంద్రం రాష్ట్రాలకు అందజేయాల్సిన సెస్‌ వాటాల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తుందో వెల్లడించలేదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమావేశంలో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది. మరోపక్క ఆదాయ పెంపు కమిటీ జీఎస్‌టీ శ్లాబుల్లో చేయాల్సిన మార్పులపై ప్రెజెంటేషన్‌ ఇవ్వనుంది. ఈ క్రమంలో కొన్ని వస్తువులపై పన్ను శ్లాబులను పెంచే అవకాశాలు ఉన్నాయి.

రూ.50వేల కోట్లపై వాడీవేడీ చర్చ..

ఇప్పటి వరకు కేంద్రం రూ.50వేల కోట్ల మేరకు రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చివరికి భాజపా రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఈ అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల రాజ్యసభలో బయటపడింది. మరోపక్క ఆర్థిక మంత్రి మాత్రం అక్టోబర్‌ వరకు కేంద్రం వసూలు చేసిన సెస్‌ మొత్తం కంటే ఎక్కువగానే రాష్ట్రాలకు విడుదల చేశామని ఇటీవల పేర్కొన్నారు. ఇప్పటి వరకు సేకరించిన సెస్సుతో రాష్ట్రాలకు అవసరమైన పరిహారం చెల్లించడం అసంభవమని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. దీంతోపాటు ఆదాయం పెంపునకు సలహాలు పంపిస్తే జరగబోయే జీఎస్‌టీ భేటీలో చర్చిస్తామని పేర్కొంది. దీనిపై అప్పట్లో రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ‘మా కోసం కేంద్ర ప్రభుత్వ సమీకృత నిధి నుంచి సొమ్మును తీశారా..?’ అని అప్పట్లో ఓ రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. మరోపక్క ఈ సమావేశంలో సెస్‌ చెల్లింపుల విషయం తేలకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ‘‘ఈ మీటింగ్‌లో సెస్‌ పరిహారం విషయం తేలకపోతే మేము సుప్రీం కోర్టుకు వెళతాము’’ అని కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇస్సాక్‌ ఇప్పటికే వెల్లడించారు. పంజాబ్‌ కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. 

ఈ ఏడాది తొలి ఆరు నెలలకు కేంద్రం సెస్‌ ఆదాయం రూ.46,000 వేల కోట్ల వరకు ఉంది. ఈ సారి రాష్ట్రాలకు విడుదల చేసిన పరిహారం మొత్తం రూ.66వేల కోట్ల వరకు చేరింది. గత ఏడాది వచ్చిన మిగులు మొత్తాన్ని దీనికి ఉపయోగించారు. మరోపక్క ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు రాజస్థాన్‌కు రూ.4,400 కోట్ల సెస్‌ బకాయిలు, పంజాబ్‌కు రూ.2,100 కోట్లు, దిల్లీకి రూ.3,600 కోట్లు, మధ్య ప్రదేశ్‌కు రూ.3,000 కోట్లు , కేరళకు రూ.1600 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెలవారీగా రాష్ట్రాలకు రూ.15 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ, రాబడి మాత్రం రూ.7వేల కోట్ల నుంచి రూ.8వేల కోట్ల వరకు మాత్రమే ఉంటోంది. సెప్టెంబర్‌ జీఎస్‌టీ రాబడి 19నెలల అత్యల్పానికి చేరుకొని రూ.91,916 కోట్లుగా నిలిచింది. నవంబర్‌లో ఇది కోలుకొని రూ.1.03లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో డిమాండ్‌ కారణంగా ఈ పెరుగుదల సాధ్యమైంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.