జీఎస్టీ మండలి భేటీ తక్షణం జరగాల్సిందే! - GST Council must meet immediately
close

Published : 19/04/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎస్టీ మండలి భేటీ తక్షణం జరగాల్సిందే!

కరోనా కట్టడికి సమావేశం కీలకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి బలంగా విజృంభిస్తున్న నేపథ్యంలో జీఎస్టీ మండలి వెంటనే భేటీ కావాలని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో కీలక వైద్య పరికరాలు, ఔషధాలపై జీఎస్టీ రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపాయి. అలాగే జీఎస్టీ రేటు శ్లాబుల హేతుబద్ధీకరణ, జీఎస్టీ లోటు పరిహార చెల్లింపు గడువు పెంపు వంటి అంశాలపైనా అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉందని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్‌ చేశారు. నిబంధనల ప్రకారం.. జీఎస్టీ మండలి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒకసారి భేటీ కావాల్సి ఉంటుంది. కానీ, గత ఆరు నెలల కాలంలో వివిధ కారణాల రీత్యా జీఎస్టీ మండలి సమావేశమే జరగలేదు.

వీటికి జీఎస్టీ మినహాయింపునివ్వాలి...

కొవిడ్‌ చికిత్సలో కీలకంగా పరిగణిస్తున్న రెమ్‌డెసివిర్‌, మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ సహా మరికొన్ని ఔషధాలు, పరికరాలపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై 12 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కొరత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌తో పాటు ఆక్సిజన్ కోసం కేంద్రానికి భారీ ఎత్తున ఆర్డర్లు పెట్టాయి.

పరిహార గడువు పొడిగించాలి...

మరోవైపు జీఎస్టీ అమలు మూలంగా ఆదాయాలు కోల్పోయిన రాష్ట్రాలకు ఇచ్చే పరిహారం గడువును మరింత పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కొవిడ్‌ ప్రభావంతో రాష్ట్రాల ఆదాయాలపై ఇంకా నీలినీడలు కమ్ముకొని ఉన్నాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహార గడువును ఐదేళ్లకు పైగా పొడిగించాలని కోరుతున్నాయి. లేదంటే కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఆగమ్యగోచరంగా మారుతుందని స్పష్టం చేశాయి. అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జీఎస్టీ రేటు శ్లాబులను హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. అలాగే సహజ వాయువు, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ మండలి తప్పనిసరిగా భేటీ కావాల్సిన అసవరం ఉందన్నారు.

జాప్యం ఇందుకేనట... 

మరోవైపు మండలి భేటీ కావడంలో జాప్యానికి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడమే కారణమని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. భేటీలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత వాటిని కూడా కులుపుకొని మండలి సమావేశం జరుగుతుందని తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని