12న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ.. అజెండా ఇదే!   - GST Council to meet on Jun 12 to discuss tax cut on COVID essentials
close

Updated : 10/06/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ.. అజెండా ఇదే! 

దిల్లీ: మే నెలాఖరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (GoM) నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నెల 12న భేటీ కావాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో కరోనా చికిత్సకు అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై పన్నులు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

మే 28న జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు కరోనాకు చికిత్సకు వాడే సామగ్రి అయిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని కోరారు. అయితే, ఈ సామగ్రిపై పన్ను మినహాయించే అంశంపై అధ్యయనానికి కేంద్ర ఆర్థికశాఖ మేఘాలయా ముఖ్యమంత్రి కె. సంగ్మా నేతృత్వంలో ఓ మంత్రివర్గ సంఘాన్ని (GoM) ఏర్పాటు చేసింది. మంత్రుల బృందంతో కూడిన ఈ సంఘం జూన్‌ 7న నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు. ఈ కమిటీలో తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు.

మరోవైపు, మంత్రివర్గ సంఘంలో సభ్యుడిగా ఉన్న యూపీ ఆర్థికమంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా బుధవారం మాట్లాడుతూ.. కొవిడ్‌ రోగులకు ఉపశమనం కల్గించేలా కరోనా చికిత్సకు వాడే సామాగ్రిపై పన్నులు తగ్గించే అంశంపై తమ రాష్ట్రం అనుకూలంగానే ఉన్నప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిన పన్ను రేట్లను అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్లపై 5శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా.. కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లపై 12శాతం జీఎస్టీ విధిస్తున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని