ఆ రుణాన్ని వదిలించుకోండి... - Get rid of that loan
close

Published : 02/04/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రుణాన్ని వదిలించుకోండి...

*నా పీపీఎఫ్‌ ఖాతా వ్యవధి మరికొన్ని రోజుల్లో తీరనుంది. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలా? మరికొన్ని ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉందా? ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో తెలపగలరు?   - గౌతమ్‌
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)పైన వచ్చే రాబడికి ఎలాంటి పన్నూ ఉండదు. ప్రస్తుతం ఇందులో 7.1శాతం వార్షిక వడ్డీ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇది తగ్గే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ సురక్షిత, పన్ను ఆదా, రాబడిపై పన్ను లేని పథకాలతో పోలిస్తే.. పీపీఎఫ్‌ ఉత్తమ పెట్టుబడి పథకమే. మీరు పీపీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బును వెనక్కి తీసుకోకుండా.. మరో ఐదేళ్లు కొనసాగించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకూ చెల్లిస్తున్నట్లే.. భవిష్యత్తులోనూ జమ చేయండి. 

*ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే.. కార్పొరేట్‌ ఎఫ్‌డీలు, ఎన్‌సీడీల్లో కాస్త అధిక వడ్డీ వస్తోంది కదా.. వీటిలో మదుపు చేయడం సురక్షితమేనా?   - నరేందర్‌
కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎన్‌సీడీల్లో మదుపు చేసినప్పుడు కాస్త వడ్డీ అధికంగా వస్తుందన్నది నిజమే. కానీ, ఇవి పూర్తి సురక్షితం అని చెప్పలేం. భవిష్యత్తులో ఆ కంపెనీ నష్టపోయి, డబ్బు చెల్లించలేని పరిస్థితి వస్తే.. మన పెట్టుబడికి ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు వీటిల్లో మదుపు చేయాలని అనుకుంటే.. మంచి క్రెడిట్‌ క్వాలిటీ ఉన్న ప్రముఖ సంస్థలను ఎంచుకోండి. కానీ, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోల్చినప్పుడు వీటిలో కొంత నష్టభయం ఉంటుందని గుర్తుంచుకోండి.

*నేను అనుకోకుండా నెల క్రితం రూ.10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాను. కానీ, ఆ డబ్బుతో నాకు పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చేయాలా? లేకపోతే ఎక్కడైనా మదుపు చేయడం మేలా? ఇప్పుడు చెల్లిస్తే దాదాపు 6 శాతం వరకూ రుసుము వర్తిస్తుంది. ఏం చేయాలి?     - చైతన్య
మీరు తీసుకున్న రుణంతో మీకు అవసరం లేదు కాబట్టి, దాన్ని మీరు తిరిగి చెల్లించడమే మేలు. ముందుగా మీరు బ్యాంకుతో మాట్లాడండి. ముందస్తు చెల్లింపు రుసుమును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ప్రతి నెలా ఈఎంఐ భారం ఉండదు. ఈ డబ్బును పెట్టుబడిని పెట్టినప్పుడు.. మీరు చెల్లిస్తున్న వడ్డీని ఆర్జిస్తామా అన్నది సందేహమే. పైగా నష్టభయమూ ఉంటుంది. కాబట్టి, భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోకుండా.. ఇప్పుడే కాస్త రుసుము చెల్లించి, రుణాన్ని వదిలించుకోండి.

*మా అమ్మకు మధుమేహం ఉంది. తన పేరుమీద ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఒక బీమా సంస్థను సంప్రదిస్తే.. ఆరోగ్య పరీక్షలు అడిగారు. వైద్య పరీక్షల అవసరం లేకుండా పాలసీ తీసుకోవడం సాధ్యం కాదా? మధుమేహం ఉన్నవారికి ప్రత్యేక పాలసీలేమైనా ఉన్నాయా? - మహిపాల్‌
ఒక వయసు దాటిన తర్వాత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే.. వైద్య పరీక్షలు తప్పనిసరి. మధుమేహం ఉందంటున్నారు కాబట్టి, ఈ విషయాన్ని పాలసీ దరఖాస్తు పత్రంలో తప్పనిసరిగా పేర్కొనాలి. బీమా సంస్థ పాలసీని ఇవ్వడానికి సిద్ధం అయితే.. ప్రీమియంపై కొంత లోడింగ్‌ విధించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిం చేసుకునే సందర్భంలోనూ ఇబ్బంది ఉండదు. మధుమేహం ఉన్నవారికి ఈ మధ్యకాలంలో చాలా బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను ఇస్తున్నాయి. సాధారణ బీమా సంస్థలను సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోండి.

*నా వయసు 25 ఏళ్లు. నెలకు రూ.5వేల వరకూ మదుపు చేయగలను. ప్రస్తుతం ఒక బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. కనీసం 10-15 ఏళ్ల వరకూ మదుపు చేసేలా నా ప్రణాళిక ఎలా ఉండాలి? - హర్షిత
మీపై ఆధారపడిన వారు ఉంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. అదే విధంగా ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలనూ ఎంచుకోండి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని జమ చేసుకోండి. ఇవన్నీ పూర్తయ్యాక మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.5వేలను రెండు మూడు మంచి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. నెలకు రూ.5వేల చొప్పున కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 13శాతం రాబడి అంచనాతో.. దాదాపు రూ.24,25,000 జమవుతాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని