పసిడి వ్యాపారంలో డీలా - Gold Business is stagnant
close

Updated : 15/05/2021 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి వ్యాపారంలో డీలా

అక్షయతృతీయ అమ్మకాలు నామమాత్రమే
ఈనాడు - హైదరాబాద్‌

బంగారం విక్రయాలకు కొవిడ్‌ సెగ తగిలింది. శుభకార్యాలు సన్నగిల్లడం, లాక్‌డౌన్‌తో షాపింగుకు ఏర్పడిన ఆటంకాలు ఇందుకు కారణం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని వివిధ వర్గాల ప్రజలు భావిస్తుంటారు. అందుకే ఈ పండుగకు ఒకటి, రెండు రోజుల ముందుగా బంగారం ఆర్డర్లు భారీగా ఉంటాయి. పండుగ రోజు డెలివరీ తీసుకుంటారు. గడిచిన ఏడాదీ, ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ పర్వదినం లాక్‌డౌన్‌లో కలిసిపోయింది. గడిచిన ఏడాది వ్యాపారమే లేదు. ప్రస్తుతం రోజూ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు  అన్ని రకాల దుకాణాలు తెరుచుకున్నాయి. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో బంగారు దుకాణాలు తెరుచుకున్నాయి. అసలు బోణీ అవుతుందా? లేదా? అనుకున్నాం, స్వల్పంగానైనా వ్యాపారం జరిగిందని ఆబిడ్స్‌లోని ఓ బంగారు దుకాణ యజమాని ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. గడిచిన ఏడాది పూర్తి లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారమే జరగలేదు. ఈ ఏడాది అయిదూ, పది శాతమన్నా వ్యాపారం జరిగింది. కొన్నేళ్ల క్రితం వ్యాపారంతో పోలిస్తే తాజాగా జరిగింది ఒక శాతం కూడా ఉండదని వివరించారు.

దేశవ్యాప్తంగా
చాలా వరకు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలవుతుండడంతో ఆభరణాల వ్యాపారం బాగా తగ్గింది. అక్షయతృతీయకు డిజిటల్‌, ఆన్‌లైన్‌ల ద్వారా జరిగిన బుకింగ్‌లు చాలా తక్కువగా ఉన్నాయని అఖిల భారత రత్నాభరణాలు, ఆభరణాల దేశీయ మండలి(జీజేసీ) ఛైర్మన్‌ ఆశిష్‌ పెథె తెలిపారు.   మొత్తం మీద వినియోగదారు సెంటిమెంటు ప్రతికూలంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా..
వీడియో కాలింగ్‌ ద్వారా వర్చువల్‌ షాపింగ్‌ సదుపాయాలు, వర్చువల్‌ ట్రయల్‌ రూములు, హోమ్‌ డెలివరీ, ఇ-క్యాటలాగ్స్‌తో పాటు ముందస్తు బుకింగ్‌లపై రాయితీలు; వజ్రాభరణాల తయారీ ఛార్జీల మినహాయింపు.. ఇలా ఎన్ని ప్రచారాలు, ప్రయత్నాలు చేసినా ఈ ఏడాది అమ్మకాలు పుంజుకోలేదని జువెలరీ సంస్థలు అంటున్నాయి. బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే 5% తగ్గి రూ.47,500 స్థాయికి చేరినా పాత కస్టమర్లు మాత్రమే అక్షయ తృతీయపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రూ.3,000-4,000 ధరలో బంగారం నాణేలు, బార్లు కొనుగోలు చేస్తున్నారని ఓ ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీ అంటోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సైతం ఈ అక్షయ తృతీయకు గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను విక్రయించడం లేదు. మదుపర్లకు అంతగా ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం.

మధ్యప్రాచ్యంలో 100%
‘ఆంధ్రప్రదేశ్‌, ముంబయి, దిల్లీ, పుణె, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రిటైల్‌ స్టోర్లు మూతపడ్డాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి అక్షయ తృతీయ విభిన్నంగా ఉండబోతోంది. 20 శాతం షోరూమ్‌లే  పనిచేస్తుండడం ఇందుకు కారణమ’ని కల్యాణ్‌ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కల్యాణరామన్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా లాక్‌డౌన్‌లు లేనందున మధ్యప్రాచ్యంలోని తమ షోరూములు 100 శాతం పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అక్కడా కరోనా ముందు స్థాయిలకు వ్యాపారం చేరలేదని వివరించారు.

పసిడి బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ.4,777

మే 17 నుంచి 21 వరకు దరఖాస్తు

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం ఈనెల 17న ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు అంటే మే 21 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పసిడి బాండ్లకు ఇష్యూ ధర గ్రాముకు రూ.4,777 గా నిర్ణయించామని ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్లకు ఇష్యూ ధర రూ.4,727గా ఉండనుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని