Amazon Bribery: అమెజాన్‌ లంచం ఆరోపణలపై ప్రభుత్వ దర్యాప్తు? - Government may also start Probe into Amazon Bribe Charges
close

Updated : 21/09/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amazon Bribery: అమెజాన్‌ లంచం ఆరోపణలపై ప్రభుత్వ దర్యాప్తు?

దిల్లీ: అమెజాన్‌ న్యాయ ప్రతినిధులు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సైతం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. దీనిపై సరైన ఆధారాలు లభించిన వెంటనే దర్యాప్తు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. కేవలం మీడియా కథనాల ఆధారంగా ముందుకు వెళ్లలేమని పేర్కొన్నారు.

వ్యాపార అవకాశాలను నిలబెట్టుకునేందుకు లేదా పొందేందుకు విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని మార్నింగ్‌ కాంటెక్ట్స్‌ అనే వెబ్‌సైట్‌ నివేదిక వెల్లడించింది. దీనిపై అమెజాన్‌ ఇప్పటికే అంతర్గతంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, ఈ ఆరోపణల్లో కీలక వ్యక్తిని సుదీర్ఘ సెలవుపై పంపినట్లు కూడా తెలుస్తోంది. అయితే, ఆరోపణల్ని ఇప్పటి వరకు అమెజాన్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. అరోపణల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పుకొచ్చింది.

ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, దీనిపై అధికారికంగా ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణల్లో.. అవినీతి ఎక్కడ.. ఏ స్థాయిలో.. ఏ సమయంలో జరిగింది? అన్న వివరాలు లేవని తెలిపారు. అయితే, భారత్‌లోని అమెజాన్‌కు చెందిన ఆరు అనుబంధ కంపెనీలు ‘న్యాయ సేవల ఖర్చు’ కింద రెండేళ్లలో రూ.8,456 కోట్లు వరకు వెచ్చించినట్లు సమాచారం ఉందన్నారు. ఈ సొమ్మంతా ఎక్కడికి వెళుతోందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన విషయం అయినందున ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని వాణిజ్య సంఘం కెయిట్‌ డిమాండు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో అవినీతి నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారుల పేర్లను బయటకు వెల్లడించి, వాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని కెయిట్‌ డిమాండు చేసింది. సరైన, స్వతంత్ర దర్యాప్తును కోరుతూ అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు తాము లేఖ రాయనున్నట్లు వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు కెయిట్‌ తెలియజేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని