ఫలిస్తున్న ప్రభుత్వ ‘తయారీ’ మంత్రం! - Govt PLI is working out to be Succesful Global firms are increasing their manufacuring
close

Updated : 06/04/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫలిస్తున్న ప్రభుత్వ ‘తయారీ’ మంత్రం!

భారత్‌లో ఉత్పత్తి కార్యకలాపాల్ని విస్తరిస్తున్న గ్లోబల్‌ సంస్థలు

అపెక్స్‌ అవెలాన్‌ కన్సల్టెన్సీ ఛైర్మన్‌ గిరిజా పాండే వెల్లడి

సింగపూర్‌: ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో తమ తయారీ కార్యకలాపాల్ని భారీ ఎత్తున విస్తరిస్తున్నాయని అపెక్స్‌ అవెలాన్‌ కన్సల్టెన్సీ ఛైర్మన్‌ గిరిజా పాండే తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం(పీఎల్‌ఐ)’ వంటి ప్రత్యేక చర్యలే అందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న అపెక్స్‌ అవెలాన్‌ కన్సల్టెన్సీ భారత్‌లోకి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.

అంతర్జాతీయ సంస్థల ఆసక్తి నేపథ్యంలో పీఎల్‌ఐ పథకాన్ని మరిన్ని రంగాలకూ విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా దేశీయంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీని పెంచాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో భారత జీడీపీలో ప్రస్తుతం ఉన్న 17-18 శాతం తయారీ రంగ వాటా 25 శాతానికి పెరిగే అవకాశం ఉందని పాండే తెలిపారు. పీఎల్‌ఐ పథకాల ద్వారా అందించిన ప్రోత్సాహకాలతో రానున్న రోజుల్లో ఏడాదికి రూ.2.45 ట్రిలియన్ల విలువ చేసే ఎలక్ట్రానిక్‌/ఐటీ వస్తువులు భారత్ నుంచి ఎగుమతి కావడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సంస్థల్ని భారత్‌కు రప్పించాలనే ఉద్దేశంతోనే కేంద్రం పీఎల్‌ఐ పథకాన్ని తీసుకొచ్చిందని పాండే అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పటికే శాంసంగ్‌, యాపిల్‌ భారత్‌లో తమ కార్యకలాపాల్ని విస్తరించాయని తెలిపారు. ఐఫోన్ల తయారీని ఇప్పటికే విస్తరించిన యాపిల్‌.. ఆధునిక ఐపాడ్‌ ట్యాబ్లెట్ల ఉత్పత్తిని కూడా ఇక్కడే ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. చైనాలో తయారీపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న యాపిల్‌.. భారత్‌లో పీఎల్‌ఐ పథకంపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు.

ఆసియా మార్కెట్‌ అభిరుచులకనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ యోచిస్తోందని పాండే తెలిపారు. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోందని వెల్లడించారు. దీంతో భారత అవసరాలు తీర్చడమేగాక ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేసే అవకాశం కంపెనీలకు వస్తుందని పేర్కొన్నారు. యాపిల్‌తో పాటు తైవాన్‌కు చెందిన పెగాట్రాన్‌, ఫాక్స్‌కాన్‌ భారత్‌లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు శాంసంగ్‌, డిక్సన్‌ టెక్‌, యూటీఎల్‌, నియోలింక్స్‌, లావా ఇంటర్నేషనల్‌, ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రోమ్యాక్స్‌ వంటి సంస్థలు పీఎల్‌ఐ ప్రయోజనాలతో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నాయని వెల్లడించారు.

యాపిల్‌ విస్తరణ, టెస్లా ప్రవేశంతో 2021లో భారత్‌ తయారీ హబ్‌గా రూపాంతరం చెందనుందని పాండే తెలిపారు. రైడ్‌ సర్వీసెస్‌ సంస్థ ఓలా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ సంస్థను ఏర్పాటు చేస్తోందని గుర్తుచేశారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని