రహదారులు.. నడవాలు.. మెట్రో పరుగులు - Govt allocations for metros roads
close

Published : 01/02/2021 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రహదారులు.. నడవాలు.. మెట్రో పరుగులు

ఇంటర్నెట్‌ డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో రహదారులు, ప్రజా రవాణా కోసం సముచిత రీతిలో కేటాయింపులు చేశారు. 13,000 కిలో మీటర్లకు పైగా రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.3.3 లక్షల కోట్లు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.5.35 లక్షల కోట్ల విలువైన భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 3,800 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామన్నారు. 2022, మార్చిలోపు జాతీయ రహదారుల నడవాల్లో మరో 8,500 కిలోమీటర్ల రహదారులకు కేటాయింపులు పూర్తి చేస్తామన్నారు.

ఆర్థిక నడవాలు

రహదారుల మౌలికాభివృద్ధి కోసం మరిన్ని ఆర్థిక నడవాలను ఏర్పాటు చేస్తున్నామని నిర్మల తెలిపారు. రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడితో తమిళనాడులో 3,500 కి.మీ జాతీయ రహదారుల పనులు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మధురై-కొల్లాం, చిత్తూరు‌-తాట్చూరు‌ నడవాల పనులు వచ్చే ఏడాది మొదలవుతాయన్నారు. రూ.65,000 కోట్లతో కేరళలో 1100 కి.మీ, 600 కి.మీ పొడవైన ముంబయి-కన్యాకుమారి నడవాను కలుపుకొని నిర్మిస్తామన్నారు. పశ్చిమ్ ‌బంగాలో రూ.25,000 కోట్లతో కోల్‌కతా-సిలిగుడి రహదారులను ఉన్నతీకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం అసోంలో రూ.19,000 కోట్ల విలువైన హైవే పనులు కొనసాగుతున్నాయని,  మరో రూ.34,000 కోట్లతో 1300 కి.మీ మేర హైవే నిర్మిస్తామన్నారు.

మెట్రో పరుగులు

పట్టణ మౌలిక నిర్మాణాలపైనా ప్రభుత్వం భారీగా ఖర్చుచేయనుంది. పట్టణ ప్రాంతాల్లో మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరణ, సిటీ బస్‌ సేవల అనుసంధానం చేపడతామని నిర్మల పేర్కొన్నారు. బస్సు సేవల కోసం రూ.18,000 కోట్లతో కొత్త పథకం తీసుకొస్తున్నామని ప్రకటించారు. పీపీపీ విధానంలో 20వేల బస్సులు నడిపేలా ఈ పథకం ఉంటుందన్నారు. ఫలితంగా ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ పుంజుకుంటుందని, కొత్త ఉద్యోగాలు దొరుకుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 702 కి.మీ మేరకు సంప్రదాయ మెట్రో సేవలు అందుతున్నాయన్నారు. మరో 27నగరాల్లో 1,016 కిమీ మేర మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్‌ నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. టైర్‌-1 నగర శివార్లు, టైర్‌ 2 నగరాల్లో మెట్రో అనుభవం అందించేందకు ‘మెట్రో లైట్‌’, ‘మెట్రో నియో’ సాంకేతికతను ఉపయోగిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ వాటా కింద 11 కి.మీ కోచి మెట్రో రెండో దశకు రూ.1957 కోట్లు, 118.9 కి.మీ చెన్నై మెట్రో రెండో దశకు రూ.63,246 కోట్లు, 58 కి.మీ బెంగళూరు మెట్రో ఫేజ్‌ 2ఏ, 2బి కి రూ.14,788 కోట్లు, నాగ్‌పుర్‌ మెట్రో ఫేజ్‌ 2 కోసం రూ.5,976 కోట్లు, నాసిక్‌ మెట్రో కోసం రూ.2,092 కోట్లు కేటాయిస్తున్నామని నిర్మల తెలిపారు.

ఇవీ చదవండి
బడ్జెట్‌ 2021: మీమ్స్‌ మామూలుగా లేవు!
బడ్జెట్..రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం!

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని