Vodafone - Idea: టెల్కోలను కొనే ఆసక్తి ప్రభుత్వానికి లేదు: వొడాఫోన్‌ ఐడియా - Govt has no interest in acquiring any telecom company says VIL CEO
close

Updated : 26/09/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vodafone - Idea: టెల్కోలను కొనే ఆసక్తి ప్రభుత్వానికి లేదు: వొడాఫోన్‌ ఐడియా

దిల్లీ: టెలికాం కంపెనీలను కొనుగోలు చేయడంపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(వీఐఎల్‌) ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ అన్నారు. బకాయిలపై వడ్డీలను ఈక్విటీల రూపంలో చెల్లించే సదుపాయం కల్పించిందన్నారు. తమ కంపెనీ మార్కెట్‌లో పోటీపడాలని సర్కార్‌ ఆశిస్తోందన్నారు. దేశంలో కనీసం మూడు ప్రైవేట్‌ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు ఉండాలని భావిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల టెలికాం రంగానికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు తనకు ఈ విషయాలు అవగతమయ్యాయన్నారు.

వీఐఎల్‌కు స్థూలంగా రూ.1.91 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల చెల్లింపుల కింద రూ.1.06 లక్షల కోట్లు, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిల కింద రూ.62,180 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.23,400 కోట్ల బకాయి పడింది. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపు కష్టంగా మారడంతో ఓ దశలో వీఐఎల్‌లో ప్రభుత్వం కొంత వాటా సొంతం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని తాజాగా వీఐఎల్‌ ఖండించింది.

ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగానికి కేంద్ర మంత్రివర్గం 9 సంస్కరణలతో భారీ ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రంగంలోకి నేరుగా (ఆటోమేటిక్‌ మార్గంలో) 100 శాతం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం విధించింది. టెలికాం యేతర ఆదాయాలను ఏజీఆర్‌ నుంచి మినహాయించింది. కొరత ఉన్న స్పెక్ట్రమ్‌ను పంచుకోవడానికి అనుమతి ఇవ్వడం; సుంకాలు చెల్లించే ఆదాయ నిర్వచనంలో మార్పులనూ ఆమోదించింది. బకాయిలపై మారటోరియం, ఏజీఆర్‌ నిర్వచనంలో టెలికాంయేతర ఆదాయాలను మినహాయించడం వల్ల వొడాఫోన్‌ ఐడియా వంటి దివాలా అంచున ఉన్న కంపెనీలకు ఊరట దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని