రూ.5 లక్షల వరకు జమలపై పీఎఫ్‌కు పన్ను మినహాయింపు - Govt hikes PF threshold limit to Rs 5 lakh for earning tax free interest
close

Published : 24/03/2021 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.5 లక్షల వరకు జమలపై పీఎఫ్‌కు పన్ను మినహాయింపు

పార్లమెంటులో నిర్మలా సీతారామన్‌ వెల్లడి

దిల్లీ: భవిష్య నిధి(పీఎఫ్‌)లో వడ్డీపై పన్ను మినహాయింపు పొందడానికి పరిమితిని కొన్ని నిర్దిష్ట కేసుల విషయంలో గరిష్ఠంగా రూ.5 లక్షలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పీఎఫ్‌ ఖాతాలో ఉద్యోగుల, యాజమాన్యాల వాటా కలిపి ఏడాదిలో రూ.2.50 లక్షలకు మించి జమ అయినట్లయితే దానిపై లభించే వడ్డీకి పన్ను పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే.  అది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఆర్థిక బిల్లుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు నిర్మల సమాధానమిస్తూ పీఎఫ్‌ పరిమితి గురించి ప్రస్తావించారు. ‘‘చట్ట ప్రకారం ఉద్యోగి మూల వేతనంపై 12 శాతం వరకు యాజమాన్యం తన వాటాగా పీఎఫ్‌లో జమ చేస్తుంది. యాజమాన్యాలు ఒకవేళ ఇంతకు మించి మొత్తాన్ని పీఎఫ్‌లో జమ చేస్తే అప్పుడు.. తాజా పరిమితిగా ప్రకటించిన రూ.5 లక్షలకు ఆ మొత్తాన్ని పరిగణనలో తీసుకోం. అంటే- చందాదారుని పీఎఫ్‌ ఖాతాకు యాజమాన్యాలు తమ వాటా కంటే అదనంగా జమ చేయనప్పుడే ఏటా రూ.5 లక్షల మొత్తం వరకు పీఎఫ్‌ జమలపై వడ్డీకి పన్ను మినహాయింపు కొనసాగిస్తాం’’ అని వెల్లడించారు. రూ.2.50 లక్షల కంటే తక్కువ పీఎఫ్‌ను ఏటా జమ చేసేవారు 92-93% వరకు ఉంటారని, వారికి పన్ను రహిత వడ్డీ లభిస్తుందని చెప్పారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని