విదేశీ టీకాలపై దిగుమతి సుంకం రద్దు? - Govt likely to levy Import duty on foreign Vaccines
close

Updated : 20/04/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశీ టీకాలపై దిగుమతి సుంకం రద్దు?

దిల్లీ: కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విదేశీ టీకాలపై విధించే 10 శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని భావిసున్నట్లు సమాచారం. ఫలితంగా తక్కువ ధరకే టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మహమ్మారి కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. దీంతో టీకాలకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశీయంగా తయారవుతున్న టీకాలతో పాటు విదేశీ వ్యాక్సిన్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, వంటి సంస్థలు భారత్‌లో తమ టీకాల వినియోగానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి ఇప్పటికే అనుమతి లభించింది.

విదేశాల నుంచి వస్తున్న వ్యాక్సిన్లపై ప్రస్తుతం ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకం, 16.5 శాతం ఐ-జీఎస్టీ, సోషల్‌ వెల్ఫేర్‌ సర్‌ఛార్జి విధిస్తోంది. దీంతో దేశీయంగా తయారవుతున్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ కంటే వీటి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకాన్ని తొలగించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఈ దిశగా అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయంపై గత డిసెంబరు నుంచే చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ, దిగుమతి సుంకం తొలగించడం వల్ల తలెత్తే ప్రభావంపై కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేస్తూ వచ్చింది. చివరకు విదేశీ టీకాల వినియోగానికి భారత్‌లో అనుమతి లభించే వరకు దీన్ని పక్కనపెడతామని నిర్ణయించారు. తాజాగా విదేశీ వ్యాక్సిన్ల అవసరం రావడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని