‘రిలయన్స్‌-ఫ్యూచర్‌’కు ఊరట! - HC stays order restraining FRL to go ahead with Reliance deal
close

Updated : 22/03/2021 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రిలయన్స్‌-ఫ్యూచర్‌’కు ఊరట!

దిల్లీ: రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఫ్యూచర్‌ రిటైల్‌కు దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలపై అదే కోర్టులోని ఉన్నత ధర్మాసనం స్టే విధించింది. అలాగే ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఈవో కిశోర్ బియానీ సహా ఇత‌రుల ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌న్న ఉత్తర్వులను సైతం నిలిపివేసింది. ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ కోర్టుని ఆశ్రయించిన అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఏక సభ్య ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ఫ్యూచర్‌ గ్రూప్‌ శనివారం దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌, జస్మీత్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది.

ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇదీ...

రిలయన్స్‌ గ్రూప్‌తో కుదిరిన రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని నిలిపివేయాలని దిల్లీ హైకోర్టు గురువారం కిశోర్‌ బియానీ నేతృత్వంలోని రిటైల్ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సింగపూర్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఫ్యూచ‌ర్స్ రిటైల్ ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందని అభిప్రాయపడింది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వయోజనులకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వీలుగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.20 లక్షల నగదు అందజేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లను కోర్టు ఆదేశించింది. సీఈవో కిశోర్ బియానీ, ఇత‌రుల ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వ‌చ్చేనెల 28వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కిశోర్ బియానీ, త‌దిత‌రుల‌ను ఆదేశించింది. అలాగే, మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు 3 నెలల జైలు శిక్ష ఎందుకు విధించకూడదో కూడా తెలపాలని కోరింది. దీన్ని ఫ్యూచర్‌ గ్రూప్‌ శనివారం సవాల్‌ చేయగా.. ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపై ఉన్నత ధర్మాసనం నేడు స్టే విధించింది.

వివాదం ఇదీ...

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది.ఆ సంస్థ సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. ఆ కోర్టు రిలయన్స్‌తో డీల్‌పై స్టే విధించింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.

ఇవీ చదవండి...

అప్పుల ఊబిలో కుటుంబాలు

ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని