హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చేతికి ఎక్సైడ్‌ లైఫ్‌ - HDFC Life Exide Life at Hand
close

Updated : 04/09/2021 04:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చేతికి ఎక్సైడ్‌ లైఫ్‌

విలువ రూ.6687 కోట్లు

ముంబయి: ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడించింది. ఈ లావాదేవీకి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ శుక్రవారం తెలిపింది. ‘జీవిత బీమా విపణిలో వేగంగా వృద్ధి చెందేందుకే ఎక్సైడ్‌ లైఫ్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్నామ’ని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీ, సీఈఓ విభా పడాల్కర్‌ పేర్కొన్నారు. ఒక్కోటీ రూ.685 విలువ గల 8.7 కోట్ల షేర్ల జారీ; రూ.726 కోట్ల నగదు చెల్లింపులు.. మొత్తం కలిసి ఈ లావాదేవీ విలువ రూ.6687 కోట్లకు చేరుతుంద’ని ఆమె వివరించారు.

ఇదో మైలురాయి: దీపక్‌ పరేఖ్‌

‘భారత బీమా రంగంలో ఇటువంటి లావాదేవీ ఇదే తొలిసారి. ఇదో మైలురాయిలాంటిద’ని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. ‘బీమా వ్యాప్తిని ఇది మరింత పెంచుతుంది. భారీ స్థాయిలో వినియోగదార్లకు ఆర్థిక రక్షణ ఇవ్వాలన్న మా లక్ష్యానికి మరింత చేరువ చేస్తుంద’ని తాజా లావాదేవీపై ఆయన వివరించారు. ప్రతిపాదిత లావాదేవీకి ఐఆర్‌డీఏఐ, సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో పాటు ఇరు కంపెనీల వాటాదార్ల అనుమతి అవసరం ఉంది.

విలీనం చేసుకుంటాం

‘లావాదేవీ పూర్తయ్యాక ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 4.1 శాతం వాటా వస్తుంది. ఈ కొనుగోలు అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో ఎక్సైడ్‌ లైఫ్‌ను విలీనం చేస్తామ’ని పడాల్కర్‌ తెలిపారు. ఈ కొనుగోలుతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సాల్వెన్సీ(రుణాలను తీర్చే శక్తి) మార్జిన్‌ ప్రస్తుతమున్న 222 శాతం నుంచి 180 శాతానికి తగ్గుతుందని వివరించారు. అయితే అది అయిదారు నెలల వరకు మాత్రమే కొనసాగుతుందని.. తర్వాత మాకు వచ్చే లాభాల కారణంగా సాల్వెన్సీ మార్జిన్‌ నిష్పత్తి పెరుగుతుందని తెలిపారు. మరో వైపు, ఎక్సైడ్‌ లైఫ్‌కు దక్షిణ భారత్‌లో ముఖ్యంగా రెండు-మూడో అంచె పట్టణాల్లోని బలమైన నెట్‌వర్క్‌ తమకు జత చేరుతుందన్నారు. ఒప్పందం ప్రకారం.. రెండేళ్ల పాటు ఎక్సైడ్‌ బ్రాండ్‌ను వినియోగించుకునే వీలుందన్నారు. లావాదేవీ పూర్తయ్యాక హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు ఏజెన్సీ వ్యాపార ఆదాయం 40%, ఏజెంట్ల సంఖ్య 35% పెరుగుతుందని ఆమె వివరించారు.

భారత-బ్రిటన్‌ ఒప్పంద చర్చలపై పరిశ్రమ హర్షం

లండన్‌: బ్రిటన్‌లోని భారత వ్యాపారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న భారత-బ్రిటన్‌ సామాజిక భద్రతా ఒప్పందం దిశగా సానుకూల అడుగులు పడడంపై భారత పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. స్వల్పకాలానికి బ్రిటన్‌కు రప్పించుకునే భారత వృత్తినిపుణులపై అదనపు వ్యయాల భారం తగ్గనుండడం ఇందుకు నేపథ్యం. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, బ్రిటన్‌ ఛాన్సలర్‌ రిషి సునక్‌ల మధ్య జరిగిన ‘ఇండియా-యూకే ఎకనమిక్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ డైలాగ్‌(ఈఎఫ్‌డీ) అనంతరం ఒక సంయుక్త ప్రకటన వెలువడింది. వాతావరణ మార్పులకు సహకారం నుంచి ఆర్థిక సేవల పెట్టుబడుల మద్దతు వరకు పలు అంశాలను ఆ ప్రకటనలో ఉటంకించారు. అదే సమయంలో బ్రిటన్‌లో తాత్కాలికంగా నియమించుకునే భారత వృత్తినిపుణులకు సామాజిక భద్రత లేదా పెన్షన్‌ వాటా చెల్లింపుల పరిష్కారానికి చర్చలు జరుపుతామని అందులో స్పష్టం చేయడం విశేషం. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమని పారిశ్రమ సంఘం ఫిక్కీ పేర్కొంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని