హ్యాచ్‌టెక్‌కు రూ.339 కోట్లు చెల్లించాలి - Hatchtech has to pay Rs 339 crore
close

Published : 17/06/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్యాచ్‌టెక్‌కు రూ.339 కోట్లు చెల్లించాలి

డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థకు ఐసీడీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఆరేళ్ల నాటి ఒక లావాదేవీ విషయంలో హ్యాచ్‌టెక్‌ పీటీవై లిమిటెడ్‌ అనే సంస్థకు 46.25 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.339 కోట్లు) పరిహారం చెల్లించాల్సిందిగా డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అనుబంధ సంస్థను అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌ (ఐసీడీఆర్‌) ఆదేశించింది. హ్యాచ్‌టెక్‌ కు చెందిన ‘జెగ్లైజ్‌’ అనే ఔషధాన్ని అమెరికా, కెనడా, భారత్‌, రష్యా, సీఐఎస్‌ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, వెనెజులా దేశాల్లో విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఔషధానికి గత ఏడాది జులైలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. దీంతో ‘ప్రీ-కమర్షియలైజేషన్‌ మైల్‌స్టోన్‌ పేమెంట్‌’ కింద డాక్టర్‌ రెడ్డీస్‌ 20 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఐసీడీఆర్‌ ముందుకు వెళ్లింది. దీన్ని విచారించిన మీదట హ్యాచ్‌టెక్‌కు 20 మిలియన్‌ డాలర్లు, దానిపై వడ్డీ, ఫీజులు కలిపి.. మొత్తం 46.25 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తాజాగా ఐసీడీఆర్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అప్పీలు చేయాలనుకుంటున్నట్లు, అందుకు  అవకాశాలను పరిశీలిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ను మోసపూరిత ఖాతాగా గుర్తించిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌

దిల్లీ: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ను మోసపూరిత ఖాతాగా పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ చెల్లించాల్సిన బకాయిలు రూ.215.17 కోట్లుగా ఉన్నాయని ఆర్‌బీఐకు వెల్లడించినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ కార్పొరేట్‌ దివాలా ప్రక్రియలో గుర్తించిన మొదటి 12 ఖాతాల్లో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియంకు కంపెనీ రూ.44000 కోట్లకు పైగా బకాయిపడి ఉంది. 2018 ఆగస్టులో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల ప్రకారం లిక్విడేషన్‌ ప్రక్రియ నడుస్తోంది.
 

ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులతో కార్డుల టోకనైజేషన్‌: గూగుల్‌పే

దిల్లీ: కార్డుల టోకనైజేషన్‌ అందించే బ్యాంకు భాగస్వాముల నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు గూగుల్‌ పే తెలిపింది. కొత్తగా ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా బ్యాంకులను చేర్చినట్లు వెల్లడించింది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుల టోకనైజేషన్‌ విజయవంతం కావడంతో.. ఇప్పుడు కొత్త బ్యాంకులను తీసుకొచ్చినట్లు వివరించింది. టోకనైజేషన్‌ సాయంతో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను వెల్లడించకుండానే.. భద్రమైన డిజిటల్‌ టోకెన్‌ ద్వారా వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని