July 1st: ఎస్‌బీఐ వాత.. సిలిండర్‌ దారెటు? - Here are the changes that happens from july 1
close

Published : 30/06/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

July 1st: ఎస్‌బీఐ వాత.. సిలిండర్‌ దారెటు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వాతకు సిద్ధమవుతోంది. పరిమితికి మించి లావాదేవీలపై వినియోగదారులపై భారం మోపనుంది. జులై 1 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు జులై 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంతో పాటు, మన జేబుపై నేరుగా ప్రభావం చూపే పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో తెలుసుకోండి..

SBI నుంచి ఇక నాలుగే: ప్రాథమిక పొదుపు బ్యాంకు డిపాజిట్‌ ఖాతా (బీఎస్‌బీడీ) కలిగిన ఖాతాదారుల లావాదేవీలపై జులై 1 నుంచి కొన్ని పరిమితులు విధించేందుకు ఎస్‌బీఐ సిద్ధమవుతోంది. ఈ ఖాతా ఉన్న వారు బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 

చెక్కు బుక్కుకూ లిమిట్‌: చెక్కులు కూడా ఏడాదికి 10కి మించితే భారం మోపేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. 10 చెక్కుల కొత్త చెక్కు పుస్తకం కోసం రూ.40, 25 చెక్కుల పుస్తకం కోసం రూ.75 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది. 

ఎల్పీజీదీ అదే దారా?: ఇంట్లో వాడే ఎల్పీజీ సిలిండర్‌ ధరలు జులై 1న మారనున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌ ధరలను ప్రతి 15 రోజులకోసారి పెట్రోలియం కంపెనీలు సవరిస్తుంటాయి. ఆ లెక్కన జులై 1న సిలిండర్‌ ధరలు మారాల్సి ఉంది. గత కొద్దిరోజలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వస్తున్న ఆయిల్‌ కంపెనీలు కంపెనీలు.. సిలిండర్‌ విషయంలో ఏం చేస్తాయనేది చూడాలి మరి.

‘సిండికేట్‌’ కోడ్‌లు మారనున్నాయ్‌: బ్యాంకుల మెగా విలీనంలో భాగంగా సిండికేట్‌ బ్యాంక్‌.. కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి సిండికేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్‌ఎసీ కోడ్‌లు వినియోగించాల్సి ఉంటుంది. కెనరా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీటిని పొందొచ్చు.

పాత చెక్కులు చెల్లవ్‌: మీరు ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ వినియోగదారులా? అయితే ఇది మీకే. ఈ రెండు బ్యాంకులు యూనియన్‌ బ్యాంకులో విలీనం అయిన నేపథ్యంలో పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్‌. కొత్త చెక్కుబుక్కులు యూనియన్‌ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

‘హీరో’ ధరల పెంపు: ద్విచక్ర వాహన ధరలు పెంచేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ సిద్ధమవుతోంది. ముడి సరకు ధరలు పెరగడంతో వాహన ధరలు పెంచుతున్నట్లు ఇది వరకే ఆ కంపెనీ వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

టీడీఎస్‌ కొత్త రూల్స్‌: గత రెండు ఆర్థిక సంవత్సరాల ఆదాయానికి సంబంధించి మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్‌), మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) ₹50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమ‌ల్లోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని