రోడ్డుపక్కన మెకానిక్‌లకు హీరో ఎలక్ట్రిక్‌ శిక్షణ! - Hero Electric aims to train roadside mechanics
close

Published : 04/04/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డుపక్కన మెకానిక్‌లకు హీరో ఎలక్ట్రిక్‌ శిక్షణ!

దిల్లీ: విద్యుత్తు వాహనాలకు క్రమంగా గిరాకీ పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తమ వినియోగదారులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేలా రోడ్డు పక్కన ఉండే సాధారణ మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రానున్న మూడేళ్లలో మొత్తం 20 వేల మందికి ట్రైనింగ్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసేవారిలోనూ విశ్వాసం పెరుగుతుందని ఆశిస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,500 ఛార్జింగ్‌ స్టేషన్లను ప్రారంభించిన హీరో ఎలక్ట్రిక్‌ 4,000 మంది మెకానిక్‌లకు శిక్షణ కూడా ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 53 వేల విద్యుత్తు వాహన యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ వచ్చే రెండేళ్లలో 20 వేల ఛార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తోంది.

వినియోగదారుల రోజువారీ సమస్యల్ని పరిష్కరించి నిరంతరం వారికి తోడుగా ఉండేందుకే శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజల్‌ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చామని.. 2023 ఆఖరు కల్లా 20,000 మందికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ద్విచక్ర వాహనాల విక్రయమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం నెలకు సగటున 8,500 యూనిట్లను విక్రయిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు వాహనాలపై అవగాహన పెరిగే కొద్దీ మార్కెట్‌ మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాలు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని