హోమ్ కేర్ ట్రీట్మెంట్ యాడ్-ఆన్‌ తీసుకోవడం మేలేనా? - Home care treatment add on with existing health policy is beneficial or not
close

Updated : 25/06/2021 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోమ్ కేర్ ట్రీట్మెంట్ యాడ్-ఆన్‌ తీసుకోవడం మేలేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీకు ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ ఉందా? గృహ సంరక్షణ చికిత్సా ఖర్చును కవర్ చేయట్లేదా? కొత్త పాలసీకి బదిలీ అవ్వడం లేదా కొత్త ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా? అయితే ఆగండి! దీనికి బదులు యాడ్-ఆన్ కవర్‌ను కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న బీమా పాలసీకి ‘హోమ్ కేర్ ట్రీట్మెంట్’, ‘డొమిసిలియరీ ట్రీట్మెంట్’ యాడ్-ఆన్‌ను కొంత అదనపు ప్రీమియంతో అందించాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) బీమా సంస్థలకు తాజాగా సూచించింది. కొవిడ్ పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకునే వారికి ఈ యాడ్-ఆన్‌ ఉపయోగపడుతుంది.

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పటికే గృహ సంరక్షణ చికిత్సను పాలసీలో భాగం చేశాయి. ఇలాంటి పాలసీలు హోమ్ కేర్ ట్రీట్మెంట్‌కు అయ్యే ఖర్చును పాలసీదారుడు తిరిగి పొందడంలో సహాయపడతాయి. అయితే ఈ ఆప్షన్ అన్ని పాలసీల్లో తప్పనిసరిగా ఉండాలనేం లేదు. అంతేకాకుండా కవరేజ్ కూడా వేరు వేరు పాలసీలకు వేరు వేరుగా ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి ఆరోగ్య సంబంధిత చికిత్సను ఇంటి వద్ద తీసుకుంటే అది హోమ్ కేర్ ట్రీట్మెంట్ లేదా డొమిసిలియరీ హాస్పటలైజేషన్ కిందకి వస్తుంది. ఇది నాన్-లైఫ్ ఇన్సురెన్స్‌లో భాగం. ఇంటి వద్ద కనీసం 72 గంటల పాటు చికిత్స తీసుకుని ఉండాలనే నిబంధన వర్తిస్తుంది.

కొవిడ్ సెకెండ్ వేవ్‌లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్, మందులు, పడకల కొరత ఏర్పడింది. ఆ సమయంలో అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు తప్ప మిగిలిన వారికి ఆసుపత్రిలో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చాలామంది ఇంటి వద్దనే ఉంటూ వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకున్నారు. కొన్ని చోట్ల ఇంటి వ‌ద్ద‌నే ఐసీయూను ఏర్పాటు చేసుకోవ‌ల‌సి వ‌చ్చింది. ఈ ప‌రిస్థితి హోమ్ కేర్ ట్రీట్‌మెంట్ అవ‌స‌రాల‌కు అద్దం ప‌డుతుంది. పాలసీలో హోమ్-కేర్ ఫీచర్ ఉన్నవారిలో చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలను ఉపయోగించుకున్నారు. ఐఆర్‌డీఏఐ తాజా నోటిఫికేషన్‌తో సంస్థలు అందించే యాడ్-ఆన్లు తీసుకోవడం వల్ల మూడో వేవ్ పరిస్థితులు వస్తే, అప్రమత్తతతో ఉంటూ ఇంట్లోనే చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. 

ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా?
నియంత్ర‌ణ సంస్థ నిర్ణ‌యంతో కొనుగోలుదారులు, వారి ప్ర‌స్తుత పాల‌సీకి అనుబంధంగా డొమిసిలియ‌రీ క‌వ‌ర్‌/హోమ్ ట్రీట్‌మెంట్ క‌వ‌ర్‌ను యాడ్‌-ఆన్‌గా తీసుకునే వీలు క‌ల్గింది. చాలా పాలసీల్లో ఈ ఫీచ‌ర్ లేదు. కొవిడ్‌ వేళ చాలామంది ప్ర‌జ‌లు హోమ్‌-క్వారెంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవ‌డం మ‌నం చూశాం. పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల్ల గృహ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు బీమా సంస్థ‌లు చెల్లిస్తాయి. కాబ‌ట్టి ఆర్థిక చింత లేకుండా ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కునేందుకు, కొంత అద‌న‌పు ప్రీమియం చెల్లించ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ప్ప‌టికీ, హోమ్ కేర్ యాడ్-ఆన్‌ను తీసుకోవ‌డం మంచిది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని