బంగారు ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌ను తెలుసుకోవ‌డం ఎలా? - How to check if your gold jewellery is pure
close

Published : 24/12/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారు ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌ను తెలుసుకోవ‌డం ఎలా?

బంగారు న‌గ‌ల‌పై ముద్రించే హాల్‌మార్క్ చిహ్నం దాని స్వ‌చ్ఛ‌త‌ను తెలియ‌జేస్తుంది

ఆభ‌ర‌ణాల‌ను విక్ర‌యించిన‌ప్పుడు మాత్ర‌మే త‌మ వ‌ద్ద ఉన్న బంగారం స్వ‌చ్ఛ‌మైన‌ది కాద‌ని తెలుసుకునే వారిని మ‌నం త‌ర‌చూ చూస్తునే ఉంటాం. బంగారం వినియోగ‌దారుల‌లో భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే రెండ‌వ స్థానంలో ఉంది. మ‌న దేశంలో చాలా వ‌ర‌కు బంగారాన్ని ఆభ‌ర‌ణాల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. బంగారు న‌గ‌ల‌పై ముద్రించే హాల్‌మార్క్ చిహ్నం దాని స్వ‌చ్ఛ‌త‌ను తెలియ‌జేస్తుంది. బంగారం కొనుగోలు చేసిన ప్ర‌తిసారి దాని స్వ‌చ్ఛ‌త‌ను గురించిన వివ‌రాలు తెలుసుకుంటున్నారా?

బంగారు ఆభ‌ర‌ణాల‌కు హాల్‌మార్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తుంది. 2020 జ‌న‌వ‌రి 15 నుంచి బంగారు ఆభ‌ర‌ణాలు, బంగారంతో రూపొందించిన క‌ళాఖండాల‌కు హాల్‌మార్క్‌ను త‌ప్ప‌ని స‌రి చేసే నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు డిసెంబ‌రు 6న జ‌రిగిన రాజ్య‌స‌భ‌లో కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ‌ల మంత్రి దాన్వే రైసాహెబ్ దాదారావు రాత‌పూర్వ‌కంగా తెలిపారు.

హాల్‌మార్క్ ఆభ‌ర‌ణాల స్వ‌చ్చ‌త‌ను తెలియ‌జేస్తుంది. కాబ‌ట్టి ప్ర‌భుత్వం తీసుకునే ఈ చ‌ర్య వినియోగ‌దారులకు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని, స్వ‌చ్చ‌తను ధృవీక‌రించిన బంగారాన్ని మాత్ర‌మే కొనుగోలు చేయ‌గ‌ల‌గుతారని, ఇండియా బులియ‌న్ అండ్ జ్యూవెల‌ర్ అసోసియేష‌న్ జాతీయ అధ్య‌క్షుడు పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. ప్ర‌స్తుతం న‌గ‌ల దుకాణ‌దారులు ఇష్టానుసారం మాత్ర‌మే హాల్‌మార్క్‌ను వేయిస్తున్నారు. చాలా త‌క్కువ శాతం మంది దుకాణాదారులు మాత్రమే హాల్‌మార్క్‌తో కూడిన ఆభ‌ర‌ణాల‌ను విక్ర‌యిస్తున్నారు.

మార్కెట్లో స్వ‌చ్ఛ‌త కరువ‌డింది. మ‌లిణాల‌తో కూడిన బంగారాన్ని ఎక్కువ ధ‌ర‌కు విక్రయిస్తున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం స‌రైన‌ది. ప్ర‌స్తుతం ఇది అవ‌స‌రం కూడా అని టైటాన్ కంపెనీ లిమిటెడ్ జ్యువెలరీ డివిజన్ రిటైల్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కుల్హల్లి అభిప్రాయప‌డ్డారు. కొఠారి ప్ర‌కారం, 3 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న బంగారం వ్యాపారాస్తుల‌లో దాదాపు 30 వేల మంది మాత్ర‌మే బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) భారతదేశంలోని అక్రిడిటేషన్ ఏజెన్సీ, ఇది ఆభ‌ర‌ణాల‌ స్వ‌చ్చ‌త‌ను పరీక్షించే హాల్‌మార్కింగ్ కేంద్రాలను ధృవీకరిస్తుంది.

న‌గ‌ల‌ను త‌యారు చేసే స్వర్ణకారుడు బీఐఎస్ నుంచి లైసెన్స్ పొందాలి. ఆ తరువాత బీఐఎస్ ధృవీక‌రించిన అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాల ద్వారా ఆభరణాలను హాల్‌మార్క్ చేయవచ్చు. 31 అక్టోబర్ 2019 నాటికి, మొత్తంగా 877 అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలను బీఐఎస్ గుర్తించింది.

మీ బంగారం స్వ‌చ్ఛ‌మైన‌ద‌ని తెలుసుకోవడం ఎలా?
చాలా మంది దుకాణాదారులు హాల్‌మార్క్ ఆభ‌ర‌ణాల‌నే విక్ర‌యిస్తారు. మీ వ‌ద్ద ఉన్నా లేదా కొనుగోలు చేయాల‌నుకుంటున్న ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌ను ఈ కింది విధంగా తెలుసుకోవ‌చ్చు.

మొద‌ట‌గా మీరు బంగారం స్వ‌చ్ఛ‌త‌ను గురించి తెలుస‌కోవాలి. ప‌సుపు లోహ స్వ‌చ్ఛ‌త‌ను క్యారెట్‌ల‌లో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం పూర్తిగా స్వ‌చ్చ‌మైన బంగారం అయితే మృదు స్వ‌భావం క‌లిగి ఉండ‌డం వ‌ల్ల‌ దీంతో ఆభ‌ర‌ణాల‌ను త‌యారు చేయ‌డం సాధ్యం కాదు. అందువ‌ల్ల 14 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల స్వ‌చ్చ‌త క‌లిగిన బంగారంతో మాత్ర‌మే ఆభ‌ర‌ణాలు త‌యారవుతాయి. ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌ను మూడు ర‌కాలుగా వ‌ర్గీక‌రించారు. 14కె, 18కె, 22కె.

ప‌ర్సంటేజ్‌ ప్ర‌కారం చూసుకుంటే 14కె - 58.5శాతం స్వ‌చ్ఛ‌త‌(585చే సూచిస్తారు), 18కె -75శాతం స్వ‌చ్చ‌త‌(750 చే సూచిస్తారు), 22కె 91.6 శాతం స్వ‌చ్చ‌త‌(916 సూచిస్తారు)ను క‌లిగి ఉంటాయి.

హాల్‌మార్క్ చేసిన ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, మీరు నాలుగు విషయాలను చూడాలి - 1.బీఐఎస్‌ లోగో (ఒక త్రిభుజం), 2. బంగారం స్వచ్ఛత (22 క్యారెట్ల బంగారానికి 916), 3. స‌ర్టిఫైడ్‌ హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్‌, 4. జూవెల‌ర్ ఐడెంటిఫికేష‌న్ మార్క్‌. ఇవి సాధారణంగా ఆభరణంపై చెక్కబడి ఉంటాయి.

స్వ‌చ్ఛతపై హామీ హాల్‌మార్క్ ఉన్న ఆభ‌ర‌ణాల‌కే ఉంటుంది. ప్రభుత్వం నుంచి వ‌చ్చే నోటిఫికేషన్‌తో మాత్ర‌మే ఇది తప్పనిసరి అవుతుంది. కాబట్టి హాల్‌మార్క్ ఉన్న ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేయ‌డం అలవాటు చేసుకోంది. కార‌ణం మీరు ఖ‌రీదైన వ‌స్తువును కొనుగోలు చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో ఇవి మీ కుటుంబ వార‌స‌త్వ సంప‌ద‌గా కూడా మార‌వ‌చ్చు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని