ఉద్యోగం పోతే ఆర్థిక ఇబ్బందులెలా ఎదుర్కోవాలి? - How-to-manage-your-finances-if-you-lost-job
close

Updated : 26/06/2021 18:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగం పోతే ఆర్థిక ఇబ్బందులెలా ఎదుర్కోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్పుడు క‌రోనా కార‌ణంగా ఎదురైన న‌ష్టాల కార‌ణంగా చాలా సంస్థ‌లు తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అయితే అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే వ‌చ్చే ఆర్థిక స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవ‌డం క‌ష్టం. మరి దాన్ని ఎలా ప‌రిష్క‌రించాల‌న్న‌ దానిపై దృష్టి పెట్టాలంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇలాంటి స‌వాళ్లు ఎదురైన‌ప్పుడు ఆర్థిక ఒత్తిడికి త‌గ్గించే ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకోవడం అవసరమంటున్నారు. దీంతో కొంత స్థిర‌త్వం ల‌భిస్తుందని, త‌ర్వాత ఏం చేయాలో ఒక స్ప‌ష్టత వ‌స్తుందని పేర్కొంటున్నారు.
కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న‌ప్పుడు చేయాల్సిన కొన్ని ప‌నులు..
మీ బడ్జెట్‌ను సమీక్షించండి
ఈ సమయంలో మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విష‌యంలో క‌చ్చిత‌మైన నిర్ణ‌యాలు తీసుకోండి. అవ‌స‌రాలు, కోరిక‌ల‌ను వ‌ర్గీక‌రించండి. అవ‌స‌రం కోసం కాకుండా సౌల‌భ్యం కోసం కొత్త వ‌స్తువుల‌ను (మొబైల్ వంటివి) కొన‌డం కొన్నిరోజులు వాయిదా వేసుకోండి. మీ బడ్జెట్‌ను సమీక్షిస్తున్నప్పుడు, కుటుంబ స‌భ్యుల‌తో ఆర్థిక ప‌రిస్థితి గురించి వివ‌రించండి. అప్పుడు ఖర్చుల విష‌యంలో వారు కూడా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. ఖ‌ర్చుల‌ను విచ‌క్ష‌ణ‌తో చేసే అవ‌కాశం ఉంటుంది. ఈ విధంగా, లిక్విడిటీని కొన‌సాగిస్తూ పొదుపుల‌ను పెంచుకోవ‌చ్చు.

మీ అత్యవసర నిధిని ఉపయోగించండి
అనుకోకుండా వ‌చ్చే ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకే అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం ముఖ్యం అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. మీకు ఇప్ప‌టికే అత్య‌వ‌స‌ర నిధి ఉంటే దాన్ని ఇటువంటి స‌మ‌యంలో ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆర్థిక ప‌రిస్థితి బాగున్న‌ప్పుడే 6-12 నెల‌ల‌కు స‌రిప‌డా డ‌బ్బును అత్య‌వ‌స‌ర నిధిగా బ్యాంకులో గానీ, లిక్విడ్ ఫండ్లలో గానీ పెట్టాలి. ఈక్విటీల్లో అయితే స్వ‌ల్ప కాలం కోసం పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. ఎందుకంటే ఇందులో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. దీర్ఘ‌కాలంలో అయితే మంచి లాభాలు పొందొచ్చు. కానీ అత్య‌వ‌స‌ర నిధి ఎప్పుడు అవ‌స‌రం అవుతుందో చెప్ప‌లేం కాబ‌ట్టి తొంద‌ర‌గా తీసుకునేందుకు వీలుండే ప‌థ‌కాల్లో పెట్టాలి.

పెట్టుబడులను కొన‌సాగించండి
ఎలాంటి స‌వాళ్లు ఎదురైన‌ప్ప‌టికీ ఇత‌ర మార్గాల నుంచి డ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం లేన‌ప్పుడు మాత్రమే పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకోవాలి. ఎందుకంటే మ‌ళ్లీ అంత డ‌బ్బు కూడ‌బెట్ట‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. చిన్న అవ‌స‌రాల‌కే పెట్టుబ‌డుల నుంచి తీసుకుంటే భ‌విష్య‌త్‌లో పిల్ల‌ల చ‌దువుల‌కు, ప‌ద‌వీ విర‌మ‌ణ‌ నిధి వంటి మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిరోజుల వ‌ర‌కు డ‌బ్బు స‌ర్దుబాటు అవుతుందేమో చూడాలి. 

రుణం తీసుకునే ముందు జాగ్రత్త వ‌హించండి
అధిక వ‌డ్డీ రేట్లు ఉన్న రుణం తీసుకుంటే ఒత్తిడిని మ‌రింత పెంచ‌డంతో పాటు మీ పొదుపు త‌గ్గిపోతుంది. ఎక్కువ వ‌డ్డీ రేట్లు ఉన్న రుణాల‌ను ముందు చెల్లించాలి. ప‌లు ర‌కాల రుణాల‌ను క‌లిగి ఉండ‌టం కంటే ఒక రుణం తీసుకొని ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. క్రెడిట్ కార్డుల‌ను కూడా త‌క్కువ‌గా ఉప‌యోగించండి. నిర్ణీత స‌మ‌యంలోపు చెల్లిస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండ‌దు. గ‌డువులోపు చెల్లించ‌క‌పోతే క్రెడిట్ కార్డుపై 36-45 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ఉంటుంద‌ని గుర్తుంచుకోండి.

ఇత‌ర మార్గాల‌ను అన్వేషించండి
మీ ఖాళీ సమయాన్ని ఉత్పాదకంగా ఉపయోగించుకొని మ‌రో ర‌కంగా ఆదాయం పొందే మార్గాల‌ను అన్వేషించండి. మీకు నిర్దిష్ట నైపుణ్యం ఉంటే, మీరు బ్లాగులు, వీడియోల ద్వారా ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించొచ్చు. ఫ్రీలాన్స్ వేదికలు, పార్ట్‌టైమ్ కన్సల్టింగ్ అవకాశాలు లేదా మీ నైపుణ్యాన్ని డబ్బు ఆర్జించడం కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇది ఉత్తమమైన మార్గం. ఇత‌ర‌ ఆదాయ వనరులు కలిగి ఉండడం.. కొన్ని ఖర్చులను తగ్గించడంలో సహాయపడటమే కాదు.. ఇది మీ మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి కూడా గొప్పగా ఉంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని