తప్పుడు సమాచారం ఐటీ ఉద్యోగుల్లోనే ఎక్కువ - IT sector witnessing highest discrepancy in employee background verification says AuthBridge
close

Updated : 05/04/2021 11:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తప్పుడు సమాచారం ఐటీ ఉద్యోగుల్లోనే ఎక్కువ

16.6 శాతం మంది అలా చేస్తున్నారు
అన్ని రంగాల్లో సగటున 8%
ఉద్యోగి నేపథ్య ధ్రువీకరణపై ఆథ్‌బ్రిడ్జ్‌ నివేదిక

దిల్లీ: గత ఏడాది (2020) ప్రతి 100 ఉద్యోగ దరఖాస్తుల్లో 8 మంది తప్పుడు సమాచారం లేదా తప్పు దారి పట్టించే సమాచారాన్ని అందించారని ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఆథ్‌బ్రిడ్జ్‌ నివేదిక వెల్లడించింది. ఇందులో ప్రధానంగా ఐటీ రంగంలోనే అధిక భాగం దరఖాస్తులు తప్పుడు సమాచారంతో వచ్చాయని తెలిపింది. సుమారు 16.6 శాతంతో ఈ రంగంలోనే అత్యధిక అసమానత కనిపించిందని పేర్కొంది. గత 6 ఏళ్లుగా ఆథ్‌బ్రిడ్జ్‌ వార్షిక నివేదిక విడుదల చేస్తోంది. మూడేళ్లుగా ఇలాంటి తప్పుడు సమాచారంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఇంకా ఈ నివేదికలోని పలు అంశాలు ఇవీ..
2020లో ఐటీ తర్వాత ఆరోగ్య సంరక్షణ రంగంలో 12 శాతం తప్పుడు దరఖాస్తులు వచ్చాయి.
రిటైల్‌లో 10.22 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) రంగంలో 9.76 శాతం, ఔషధ రంగంలో 9.65 శాతం, ప్రయాణ, ఆతిథ్య రంగాల నుంచి 9.58 శాతంతో తప్పు దారి పట్టించే సమాచారంతో ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయి.
వయసు పరంగా చూస్తే 35-39 ఏళ్ల మధ్య ఉన్న వారు అత్యధికంగా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వయసులో ఉన్న వారికి అధిక వేతన ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉండటంతో మెరుగైన ఉద్యోగావకాశాల కోసం వారి వివరాల్ని తప్పుగా దరఖాస్తుల్లో చూపిస్తున్నారు.
గత మూడేళ్ల నుంచి గమనించినా, ఈ వయసు మధ్య ఉన్న వారే తప్పుడు సమాచారంతో మెరుగైన ఉద్యోగావకాశాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉన్నత ఉద్యోగాల స్థాయిలో ఇలా తప్పుడు సమాచారం సమర్పించే వారి సంఖ్య గత మూడేళ్లుగా తగ్గింది. ఈ స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి నేపథ్యాన్ని లోతుగా కార్పొరేట్‌ కంపెనీలు పరిశీలించుకుంటాయి కాబట్టి దరఖాస్తుదార్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.
గిగ్‌ (ఒప్పంద ప్రాతిపదికన) ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి దరఖాస్తులు చాలా వరకు తగ్గాయి. 4-5 శాతం మధ్యే ఉంటున్నాయి.
ప్రధానంగా అభ్యర్థి చిరునామా, ఉపాధి, గుర్తింపు, విద్యార్హతలు వంటివి సంస్థలు పరిశీలిస్తుంటాయి. 
ఆన్‌-డిమాండ్‌ రంగంలో గత మూడేళ్లలో పోలీస్‌ ధ్రువీకరణ 3 శాతం నుంచి ఏకంగా 19 శాతానికి పెరిగింది. ఈ రంగంలో 100 దరఖాస్తుల్లో ఇద్దరిపై క్రిమినల్‌/సివిల్‌ లిటిగేషన్‌ రికార్డు ఉండటమే పోలీస్‌ ధ్రువీకరణ పెరగడానికి కారణం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని