close

Published : 05/05/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాక్‌డౌన్‌ కొనసాగిస్తే.. ఉత్పత్తిపై ప్రభావం

 మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ

దిల్లీ: వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఆంక్షలను మున్ముందూ కొనసాగిస్తే ఉత్పత్తిపై కొంత మేర ప్రభావం పడుతుందని మారుతీ సుజుకీ తెలిపింది. తయారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడితే ఆ ప్రభావం విక్రయాలపైనా ఉంటుందని అభిప్రాయపడింది. లాక్‌డౌన్‌ల వల్ల విక్రయకేంద్రాలను మూసివేయాల్సి వస్తుండటానికి తోడు ఉత్పత్తిపై కచ్చితంగా ప్రభావం పడుతుందని  మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ వెల్లడించారు. కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో ఉత్పత్తి 50 శాతం కంటే దిగువకు వస్తుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ లాక్‌డౌన్‌ విధించే ప్రాంతాలు, ఎంత సమయం కొనసాగిస్తారు అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ‘రాబోయే కొన్ని రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూడాల్సి ఉంది. ఇప్పుడే ఏ విషయాన్ని చెప్పలేమ’ని ఆయన అన్నారు.


34% తగ్గిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం

ముంబయి: ప్రైవేటు రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.75 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నమోదు చేసిన రూ.114 కోట్లతో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.2,709 కోట్ల నుంచి రూ.2,611 కోట్లకు తగ్గింది. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.506 కోట్ల నుంచి రూ.508 కోట్లకు స్వల్పంగా పెరిగింది. మొత్తం ఆదాయం రూ.10,425 కోట్ల నుంచి రూ.10,272 కోట్లకు తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 11 శాతం తగ్గి రూ.906 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 4.17 శాతంగా నమోదైంది. బ్యాంక్‌ మొత్తం కేటాయింపులు రూ.601 కోట్ల నుంచి రూ.766 కోట్లకు పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తులు 4.57 శాతం నుంచి 4.34 శాతానికి తగ్గాయి. 2021 మార్చి నాటికి కేటాయింపుల కవరేజీ నిష్పత్తి 72 శాతానికి చేరింది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు 26 శాతం పెరిగి రూ.73,121 కోట్లకు చేరగా, అందులో రిటైల్‌ డిపాజిట్లు 43 శాతం పెరిగి రూ.27,236 కోట్లుగా నమోదయ్యాయి.
3,90,000 వాహనాలు వెనక్కి: హ్యుందాయ్‌
డెట్రాయిట్‌: అమెరికా, కెనడాలలో 3,90,000 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు హ్యుందాయ్‌ వెల్లడించింది. ఇంజిన్‌లో మంటలు రావొచ్చనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరమ్మతు అయ్యేవరకు ఇంటి బయటనే వాహనాలను పార్క్‌ చేయాల్సిందిగా వాహన యజమానులకు సూచించింది. రీకాల్‌ చేసిన కార్లలో 2,03,000 వరకు  2013 నుంచి 2015 మధ్య తయారైన శాంటా ఫె స్పోర్ట్‌ ఎస్‌యూవీలే. వీటిల్లో కొన్నింటిని రెండో సారి కంపెనీ రీకాల్‌ చేస్తోంది. యాంటీ లాక్‌ బ్రేక్‌ కంప్యూటర్‌లోకి బ్రేక్‌ ఫ్లూయిడ్‌ లీక్‌ అయ్యి, ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ భావించి ఈ వాహనాలను రీకాల్‌ చేస్తోంది.


2021-22లో వృద్ధి 11.1%
 అంచనాలు తగ్గించిన గోల్డ్‌మన్‌ శాక్స్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) భారత వృద్ధి రేటు అంచనాలను గోల్డ్‌మన్‌ శాక్స్‌ తగ్గించింది. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల నేపథ్యంలో 11.1 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని పేర్కొంది. ఇంతకుముందు 11.7 శాతం వృద్ధి రేటు లభిస్తుందని సంస్థ అంచనా వేసింది. ‘క్రితం సంవత్సరంతో పోలిస్తే లాక్‌డౌన్‌ల తీవ్రత తక్కువగానే ఉంది. అయితే దేశంలోని కీలక నగరాలపై కఠిన నియంత్రణ ఆంక్షల ప్రభావం కనిపిస్తోంద’ని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. సేవల రంగాలపై ఈ ప్రభావం ఉందని పేర్కొంది. అయితే విద్యుత్‌ వినియోగం, పీఎంఐ తయారీ గణాంకాల్లో స్థిరత్వం ప్రకారం చూస్తే.. తయారీ రంగం ఇప్పటికీ పుంజుకునే దిశలోనే సాగుతోందని వెల్లడించింది. కొన్ని వారాలుగా నిరుద్యోగిత రేటు కొంత మేర పెరిగిందని, అయితే 2020 ఏప్రిల్‌- జూన్‌తో పోలిస్తే ఉద్యోగాలపై ప్రభావం పరిమితంగానే ఉందని పేర్కొంది. అందువల్ల గతేడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే ఈ సారి పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయని భావించవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్‌ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11.1 శాతంగా ఉండొచ్చని తెలిపింది. అలాగే 2021 సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 10.5 శాతం నుంచి 9.7 శాతానికి తగ్గిస్తున్నట్లు గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని