మన ఆర్థిక పరిస్థితులపై ద్రవ్యోల్బణ ప్రభావం - Impact-of-inflation-on-your-investments
close

Published : 17/02/2021 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మన ఆర్థిక పరిస్థితులపై ద్రవ్యోల్బణ ప్రభావం

వస్తువులు, సేవల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ధరలు ఎంత నిదానంగా పెరుగుతాయంటే వాటిని ఒక్కోసారి గమనించలేకపోవచ్చు. కొన్నిసార్లు ధరలు అమాంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే అధిక ద్రవ్యోల్బణ పరిస్థితి అని అంటారు. పెరిగే ధరలు, నిరుద్యోగ సమస్యలు ఆర్థిక వ్యవస్థను స్తబ్దుగా ఉంచుతుంది. ఈ పరిస్థితులన్నీ జీవన విధానంపై కొంతమేరకు ప్రభావం చూపిస్తాయి.

ద్రవ్యోల్బణం కొనుగోలు చేసే శక్తిని హరిస్తుంది. 20ఏళ్ల కింద రూపాయికి కొన్న వస్తువు నేడు చాలా అధిక ధరకు కొనాల్సి రావచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. ద్రవ్యోల్బణం ఎప్పుడు పెరిగినా అది మన కొనుగోలు శక్తిని తగ్గించేస్తుంటుంది. ఒక ఏడాదికి ద్రవ్యోల్బణ రేటు 5శాతం పెరిగిందనుకుందాం . గతేడాది కొన్న వస్తువునే ఈ సారి కొనేందుకు మీ ఆదాయం 5శాతం పెరగాల్సి ఉంటుంది. మీకు 3శాతం అధిక ఆదాయం వచ్చినా కూడా గతేడాది కొన్న వస్తువులను ఈ సారి కొనేందుకు అధిక సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణానికి తగినట్టు మీ ఆదాయం పెరగలేదు కాబట్టి అవే వస్తువులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ పెరుగుదల మీ జీవనశైలిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

పెట్టుబడులకు నష్టం:

ద్రవ్యోల్బణ ప్రభావం పెట్టుబడులపైనా ఉంటుంది. 5శాతం వడ్డీతో పెట్టుబడిని ప్రారంభించారనుకోండి. అదే ద్రవ్యోల్బణ రేటు 5శాతమే ఉంటే పెట్టుబడులతో మీరు పెద్దగా ఆర్జించేదేమీ ఉండదు. 2లేదా 3శాతం ద్రవ్యోల్బణం పెరిగినా పెట్టుబడుల ద్వారా మీరనుకున్నంత సంపాదించలేరు. అదే ద్రవ్యోల్బణం 6 లేదా 7 శాతానికి పెరిగితే మీ పెట్టుబడుల్లో నష్టం మిగులుతుంది.

వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణంతోపాటు పెరిగే ఉత్పత్తుల ధరలను సూచిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగేందుకు దోహదపడే ఇతర అంశాలు: ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ షేర్లు, భూమి, స్వల్పకాలిక వడ్డీ రేట్లు, వడ్డీ శాతం పెరుగుదల, జీవన ప్రమాణాలు అధికమవ్వడం లాంటివి.

జీవన శైలి ద్రవ్యోల్బణం:
కేవలం నెలకు రూ.20వేలతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎన్ని కుటుంబాలు ప్రశాంతమైన సాదాసీదా జీవితాన్ని గడపడంలేదు? మరి కొన్ని కుటుంబాలు నెలకు రూ.లక్ష ఆర్జిస్తున్నా నెలాఖరు వచ్చేసరికి అప్పుల కోసం పరుగెడుతున్నారు? ఈ విషయంతో ఎంత మంది ఏకీభవిస్తారు?

మనలో చాలా మందికి కళాశాల రోజులు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కళాశాలకు చక్కగా వెళ్లడం, శ్రద్ధగా చదవడం, సినిమాలకు, షికార్లకు తిరగడం. ఇదంతా మన తల్లిదండ్రులిచ్చే కొద్దిపాటి డబ్బుతోనే చేశాం. ఒక్కోసారి అనుకున్నంత డబ్బు చేతిలో ఉండకపోడంతో చిన్న చిన్న కోరికలను త్యాగం చేసి ఉంటాం.

ఉద్యోగంలో చేరి మొదటి జీతం అందుకోగానే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. తీరిక సమయాల్లో ఎలా గడుపుదామనే ఆలోచనలతో ఉండి జీవనశైలి ద్రవ్యోల్బణానికి క్రమంగా అలవాటు పడతాం. జీవనశైలి ద్రవ్యోల్బణం అంటే పెరిగే ఆదాయంతోపాటు ఖర్చులను పెంచుకుంటూ పోవడమే. వచ్చే అధిక ఆదాయమంతా జీవనశైలిని మెరుగుపర్చుకునేందుకే సరిపోతుంది.

కళాశాలలో చదివేటప్పుడు అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకుండేది కాదు. అప్పుడు జీవితం సాఫీగా సాగిపోయేది. కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి క్రమంగా బాధ్యతలు పెరుగుతుంటాయి. కొత్త లక్ష్యాలను ఛేదించాల్సి ఉంటుంది. అందుకు డబ్బు అవసరమవుతుంది. జీవనశైలి ద్రవ్యోల్బణం ఆర్థిక స్వేచ్ఛకు ప్రధాన శత్రువు. అయితే ఇది అనివార్యం.

అనుకోకుండా ప్రతిరోజు చాలా వాటిపై ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అన్ని కొనుగోళ్లు అవసరంగానే అనిపిస్తుంటాయి. కుటుంబ పరిస్థితులు అన్ని రకాల అవసరాలను తీర్చమని ప్రేరేపిస్తాయి. దాదాపు చాలా కుటుంబాలు వారికి వచ్చే ఆదాయాన్నంతా ఖర్చుపెట్టాలని చూస్తుంటాయి. ఎందుకంటే వారు ప్రతి ఆకర్షణీయమైన వస్తువును కొనుగోలు చేయాలనే ఆలోచనతో బతికేస్తుంటారు. ఖర్చు అధికంగా చేయడం వల్ల పొదుపు చేసేందుకు ఏమీ మిగలకుండా పోతుంది.

మనల్ని మనం సంతృప్తిపర్చుకునేందుకు కొత్త కారునో, కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరాన్నో ఇంకేదైనా నూతన వస్తువును కొనుగోలు చేస్తుంటాం. జీతం పెరిగినప్పుడు, అనుకోకుండా లాభాలు వచ్చినప్పుడు కొత్త వస్తువులను కొని జీవనశైలి ద్రవ్యోల్బణం అనే వలలో పడతాం.

మన సంపద వృద్ధి చేసుకునేందుకు మనం దేనికి విలువివ్వాలో తెలుసుకోవాలి. తక్షణ సంతృప్తి పొందేందుకు ఖర్చు పెట్టే బదులు ఆదాయం పెంచుకునే అనుభవానికి ఎక్కువ విలువ ఇవ్వాలన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మంచిది.

చాలావరకు డబ్బును అధికంగా ఖర్చుపెట్టడం మన ఇష్టాన్ని, ఎంపికను బట్టి ఉంటుంది. తక్షణ తృప్తిని ఇచ్చేవాటిని కొనుగోలు చేసేకన్నా తెలివిగా వ్యవహరించి మనకు ఏది అవసరమో తెలుసుకోవడం వల్ల కష్టకాలంలోనూ ఆర్థికంగా నిలబడగలుగుతాం.

చాలా మందికి వేతనం పెరుగుతుందంటే కొత్త వస్తువులను కొనేందుకు సంకేతం వచ్చినట్టుగా భావిస్తారు. కొత్త ఫర్నీచర్‌ కొనుగోలు చేసేందుకో, పెద్ద ఇంటికి మారేందుకో, కొత్త కారు కొనుగోలు చేసేందుకో తహతహలాడుతుంటారు. పెరిగిన హోదాను చూపించుకునేందుకు ఖర్చులు పెంచుకుంటూ పోతారు.

జీవితంలో దేనికి విలువ ఇవ్వాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలో లేదా కొత్త కారు కొనుగోలు చేసేందుకు ఇవ్వాలో సరైన నిర్ణయం తీసుకోగలగాలి. సంతోషకరమైన విడిదిని గడిపేందుకు ప్రస్తుతం చేసే అనవసర ఖర్చులను తగ్గించుకోలేమంటారా?

మనలో చాలామందికి ఏదో ఒక దశలో వ్యయాన్ని బలవంతంగా తగ్గించుకునే పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. నిరుద్యోగిగా ఉన్నప్పుడో, పిల్లలు పుట్టినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, అత్యవసర సమయాల్లో ఖర్చుల్లో కోత పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు.

మితంగా ఖర్చు పెట్టడమెలాగో మనందరికీ తెలిసే ఉంటుంది. అయితే సమస్యల్లా మనం దాన్ని ఆచరించం. ఇక్కడ కఠినమైన జీవితాన్ని గడపమనో, కళాశాల వెళ్లే విద్యార్థిలాగా తక్కువ ఖర్చు చేయమనడం ఉద్దేశం కాదు.
జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోగలిగితే పదవీ విరమణ తర్వాత జీవితంలోని చివరి రోజులు చక్కగా గడిపినవాళ్లమవుతాం.

జీవనశైలి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించే కొన్ని అంశాలను పరిశీలిద్దాం…

* నిత్యం క్రెడిట్‌ కార్డు బిల్లు బకాయి పడడం.
* ఎప్పుడూ ఏదో ఒకదానికి చెక్కు కట్టాల్సి రావడం.
* మీ దగ్గర ఉన్న వస్తువులు బాగా పనిచేస్తున్నా కొత్తవి కొనుక్కునేందుకు వెంపర్లాడటం.
* వినియోగ అవసరాలను తీర్చుకునేందుకు అప్పు చేయడం.
* సంతోషం కోసం ఖర్చుపెట్టడం. ఆ తర్వాత ఖర్చు పెట్టినదానికి సంతోషం మిగుల్చుకోలేదన్న బాధ ఉండిపోవడం.
* అనుకోకుండా పెద్ద లాభం వచ్చినప్పుడు దాంతో ఏదో కొత్తది కొనాలన్న ఆలోచనతో ఉండడం.
* ఇతరుల ఖర్చులను పోల్చి చూసుకోవడం.
* ఏది ఫ్యాషన్‌గా ఉందో అది కొనుగోలు చేసేందుకు ఆరాటపడటం.
పైన తెలిపిన ఏ ఒక్కదానినైనా మీరు అనుభవిస్తుంటే కచ్చితంగా మీరు జీవనశైలి ద్రవ్యోల్బణానికి గురవుతున్నట్టే.

ఈ సమస్యను ఎలా అధిగమించాలో చూద్దాం…
తేడా గమనించండి:
అవసరాలు, కోరికలు, సుఖాలు, విలాసాలు… వీటిని అర్థం చేసుకుంటే జీవనశైలి ద్రవ్యోల్బణం నుంచి బయటపడవచ్చు. అయితే చాలా మందికి వీటిల్లో తేడా గమనించలేరు. అవసరానికి విలాసానికి మధ్య చిన్న గీత ఉంటుంది.

నిజమైన సంతోషం పొందగలుగుతున్నారా?
ఆదాయం పెరిగేకొద్దీ మీ సొమ్మును దీర్ఘకాల లక్ష్యాలకు, పదవీ విరమణ అవసరాలకు మళ్లించుకోండి. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులను పెంచుకోవడం వల్ల నిజంగా మీరు సంతోషంగా ఉంటున్నారన్న విషయాన్ని ప్రశ్నించుకోండి. మీ సమాధానం కాదు అయితే వెంటనే అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంచేయండి.

లక్ష్యాన్ని ఎంచుకోండి:
లక్ష్యాలను ఎంచుకోవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి ఒక దారిలోకి వస్తుంది. సమయానికి రుణాలు చెల్లించడం, క్రెడిట్‌ కార్డు బిల్లులు కట్టడం, పిల్లల పెళ్లిళ్లకు, ఇంటికి, వారి చదువులకు సొమ్ము దాచుకోవడం, పదవీ విరమణ ప్రణాళిక వేసుకోవడం లాంటివి చేస్తే బాగుంటుంది. ప్రాథమ్యాలు పెరిగి కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరం కొనేందుకో, ఖరీదైన విహారయాత్రకు వెళ్లాలనే ఆలోచనను మానుకుంటాం.

వేతనం పెరిగిందా?
ఈ సారి మీ వేతనం పెరిగిందన్న విషయాన్ని మర్చిపోండి. జీతం పెరిగిందన్న ఆలోచనతో ఖర్చు చేసే అలవాటు పెరగవచ్చు. వచ్చిన అధిక జీతాన్ని పెట్టుబడుల్లో పెట్టడమో, పదవీ విరమణ కోసం దాచుకోవడమో చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ మదుపుచేయగలిగినవారవుతారు. జీవనశైలి ద్రవ్యోల్బణానికి బానిసలుగా మారకుండా ఉంటారు.

పోల్చి చూసుకుంటున్నారా?
జీవనశైలి ద్రవ్యోల్బణానికి అన్నిటికంటే పెద్ద శత్రువు ఇతరులతో పోల్చిచూసుకోవడం. స్నేహితులతో, పక్కింటి వారిదో నూతన గ్యాడ్జెట్‌, లేదా ఇంట్లో తీసుకున్న ఫర్నీచర్‌ను చూశాక అలాంటిదే కావాలని కోరుకుంటాం. అది మనకు ఎంతవరకు అవసరమవుతుందో కూడా ఆలోచించం.
ప్రతి ఒక్కరి ఆదాయ పరిమితులు, తీర్చాల్సిన అప్పులు, బాధ్యతలు, అవసరాలు, లక్ష్యాలు, కలలు, ప్రాథమ్యాలు వేర్వేరుగా ఉంటాయి.
మీ స్నేహితులు ఏలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ఏం తింటున్నారు అనే విషయాలను పోల్చిచూసుకోకండి.
మీకు ఆ వస్తువు కొనుగోలు చేసే శక్తి ఉన్నా సరే నిజంగా మీకది అవసరమా అని ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోండి.

క్రమంగా మారండి:
జీవనశైలిని ఉన్నతం చేసుకోవాలనుకుంటున్నారా? మీ జీతం పెరిగినప్పుడే అది గుర్తుకురావాల్సిన అవసరం లేదు. క్రమంగా మారేందుకు ప్రయత్నించండి. మీరు ఎంత మేరకు పొదుపు చేయగలిగితే భవిష్యత్తులో అంత నాణ్యమైన జీవితాన్ని గడపగలుగుతారు.

చివరగా…
జీవనశైలి ద్రవ్యోల్బణానికి గురయితే పదవీ విరమణ తర్వాత జీవితం కష్టమవుతుంది. అది గుర్తించి బయటపడగలిగితే మీ లక్ష్యాలను చేరుకోవడంలో సఫలమవుతారు. తక్షణ తృప్తి పొందేందుకు మీరు చేసే అలవాట్లను నియంత్రించుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఎంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా ఖరీదైన బట్టలను కొనుగోలు చేయకపోవడమే ఒక్కోసారి మంచిది.

వాణిజ్య ప్రకటనల శక్తి చాలా గొప్పది. వ్యాపారవేత్తలు నూతన మార్కెటింగ్‌ విధానాలతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. హోర్డింగులు, టీవీ, రేడియో ప్రకటనలు, మ్యాగజైన్‌లు, ఇంటర్నెట్‌ ప్రకటనలు… ఇంకా స్నేహితులతో జరిపే ముచ్చట్లు ఇవన్నీ మనల్ని కొత్త ఉత్పత్తులను కొనేందుకు తరుముతుంటాయి.

అందుకే ఓ సారి మీ జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని సమీక్షించుకోండి. ఇంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి. ఏమైనా పెద్ద తేడాలున్నాయా? మీ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఉన్న జీవితాన్ని గడపగలరేమో ఓ సారి పరిశీలించుకోండి. ఒకవేళ సాధ్యం చేసుకోగలిగితే మీరు ఎంత మేరకు పొదుపు చేయగలరో చూసుకుంటే ఆశ్చర్యపోక మానరు.

సంపన్నుడు రేపటి గురించి ప్రణాళిక వేసుకుంటే పేదవాడు ఈ రోజు గురించి ఆలోచిస్తాడు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని