భారత్‌కు కావాల్సిన సహకారం అందిస్తాం: బైడెన్‌ - India Helped us so we are assisting india now says Biden
close

Published : 26/04/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌కు కావాల్సిన సహకారం అందిస్తాం: బైడెన్‌

వాషింగ్టన్‌: కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు.. కావాల్సిన సహకారం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్‌కు పంపనున్నామని తెలిపారు. 

మొదటి దశ విజృంభణ సమయంలో అమెరికా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. భారత్‌ తమకు అండగా నిలబడిందని బైడెన్‌ గుర్తుచేసుకున్నారు. అదే రీతిలో ఇప్పుడు ఆపదలో ఉన్న భారత్‌కు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొవిషీల్డ్‌ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవన్‌ చేసిన ప్రకటనను బైడెన్‌ తన ట్వీట్‌కు జత చేశారు.

మరోవైపు భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ ఆందోళకరంగా ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అన్నారు. ఈ నేపథ్యంలో కావాల్సిన సాయం అందించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాయం అందిస్తూనే.. హెల్త్‌కేర్‌ వర్కర్లతో పాటు భారత ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు. 

భారత్‌లో కొవిడ్‌ రెండో దశ విజృంభణపై ఇరువురు నేతలు స్పందించడం ఇదే తొలిసారి. అంతకుముందు భారత్‌కు అండగా నిలవకపోవడంపై సొంత పార్టీలోని భారత సంతతికి చెందిన నేతల నుంచి బైడెన్ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మిగులు టీకాలతో పాటు అవసరమైన వైద్య పరికరాలు పంపాలని వారు ఒత్తిడి తెచ్చారు. గతంలో భారత్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వంటి ఔషధాల్ని అమెరికాకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం స్పందించడం గమనార్హం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని