Salary Increment: వేతనాలు 8.6శాతం పెరుగుతాయ్‌! - India Inc expected 8.6 pc avg increment in 2022 Deloitte survey
close

Published : 21/09/2021 22:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Salary Increment: వేతనాలు 8.6శాతం పెరుగుతాయ్‌!

నైపుణ్యాలు, పనితీరుకు ప్రాధాన్యం
ఐటీ రంగంలో రెండంకెల పెంపు 
రిటైల్, ఆతిథ్య, స్థిరాస్తి రంగాల్లో తక్కువగానే 
2022పై డెలాయిట్‌ సర్వే

దిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో (2021) దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు తమ సిబ్బందికి సగటున 8 శాతం వేతనాలు పెంచాయని, 2022లో ఇది 8.6 శాతంగా ఉండే అవకాశం ఉందని డెలాయిట్‌ సర్వే వెల్లడించింది. వచ్చే ఏడాది సగటు వేతనాల పెంపు ‘కొవిడ్‌-19 ముందు స్థాయికి’ చేరుకోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, వినియోగదారుల విశ్వాసం మెరుగవుతుండటం ఇందుకు దోహదం చేయొచ్చని  తెలిపింది. సిబ్బంది, వేతనాల ధోరణులపై రెండో విడత సర్వేను ఈ ఏడాది జులైలో డెలాయిట్‌ నిర్వహించింది. ఏడు రంగాలు, 24 ఉపరంగాల్లోని 450కి పైగా సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ప్రధానంగా హెచ్‌ఆర్‌ వృత్తి నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదిక రూపొందించారు. ‘2021తో పోలిస్తే 2022లో ఎక్కువ వేతనాల పెంపును చాలా కంపెనీలు ప్రకటించే అవకాశం ఉంది. కొవిడ్‌-19 అనిశ్చితులు ఇంకా కొనసాగుతున్నందున.. వేతనాల పెంపుపై ఇప్పుడే అంచనాకు రావడం కంపెనీలకు కష్టంగానే ఉంది. కొవిడ్‌-19 రెండో దశ అనంతరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను తగ్గించిన నేపథ్యంలో.. ఈ తరహా పరిణామాలను గమనిస్తూ వచ్చే ఏడాది వేతనాల పెంపుపై కంపెనీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’అని డెలాయిట్‌ పేర్కొంది. ఈ సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం...

* 2021లో 92 శాతం కంపెనీలు సగటున 8 శాతం వేతనాలు పెంచాయి. 2020లో వేతనాల పెంపు 4.4 శాతమే. 60 శాతం కంపెనీలు మాత్రమే గతేడాది వేతనాలు పెంచాయి.

* 2022లో సగటున వేతనాల పెంపు 8.6 శాతంగా ఉండే అవకాశం ఉంది. కొవిడ్‌-19 పరిణామాలకు ముందు అంటే 2019 సమయంలో ఇంచుమించు ఈ స్థాయిలోనే సగటు వేతనాల పెంపు ఉండేది.  సుమారు 25 శాతం కంపెనీలు రెండంకెల వేతన పెంపును ప్రకటించే అవకాశం ఉంది.

* నైపుణ్యం, పనితీరు ఆధారంగా వేతనాల పెంపులో వ్యత్యాసాలను కంపెనీలు కొనసాగించనున్నాయి. సగటు ప్రదర్శన కనబర్చిన వారితో పోలిస్తే.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినవారికి 1.8 రెట్ల మేర వేతనాల పెంపు ఉండే అవకాశం ఉంది.

* అత్యధిక వేతనాల పెంపు ఉండే రంగాల్లో ఐటీ మొదటి స్థానంలోను, లైఫ్‌ సైన్సెస్‌ ఆ తర్వాతి స్థానంలోనూ ఉండొచ్చు. ఐటీ రంగంలో మాత్రమే రెండంకెల వేతనాల పెంపు ఉండే అవకాశం ఉంది. డిజిటల్‌/ ఇ-కామర్స్‌ కంపెనీల్లో కొన్ని ఎక్కువమొత్తం వేతనాల పెంపును ప్రకటించవచ్చు.

* రిటైల్, ఆతిథ్య, రెస్టారెంట్లు, మౌలిక, స్థిరాస్తి రంగాల్లో కొంత మేర తక్కువగా వేతనాల పెంపు ఉండొచ్చు.

* కొవిడ్‌-19 పరిస్థితుల కారణంగా సుమారు 60 శాతం కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీలను నవీకరించగా.. 24 శాతం కంపెనీలు జీవిత బీమా పాలసీల్లో మార్పులు చేశాయి. 

వీలును బట్టి ఇంట్లో లేదంటే ఆఫీసులో...

మునుపటి పని విధానానికి (ఆఫీసుకు వచ్చి పనిచేయడం) మారే విషయంపై ఉద్యోగుల అభిప్రాయాన్ని సేకరించి నిర్ణయం తీసుకుంటున్న కంపెనీలు కేవలం 25 శాతమేనని సర్వే తెలిపింది. ఈ సర్వేలో చాలా మంది ఉద్యోగులు వీలును బట్టి ఇంటి నుంచి లేదంటే కార్యాలయం నుంచి పని చేయడానికి (హైబ్రిడ్‌) ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా చూస్తే.. ఇప్పటివరకు మునుపటి పని విధానానికి మారాలనే విషయంపై 40 శాతం కంపెనీలే నిర్ణయం తీసుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని