ప్రపంచ సైబర్‌ భద్రత సూచీలో టాప్‌-10లోకి భారత్‌ - India ranks among top 10 in ITUs Global Cybersecurity Index
close

Published : 01/07/2021 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచ సైబర్‌ భద్రత సూచీలో టాప్‌-10లోకి భారత్‌

 ఒకేసారి 37 స్థానాలు పైకి

ముంబయి: భారత్‌ అరుదైన ఘనతను సాధించింది. సైబర్‌ భద్రత ప్రమాణాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పదో దేశంగా నిలిచింది. ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌(ఐటీయూ) రూపొందించిన గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌(జీసీఐ)-2020లో 37 స్థానాలు మెరుగుపరచుకుని మరీ టాప్‌-10లోకి వెళ్లింది. ప్రపంచంలోనే ఐటీ సూపర్‌ పవర్‌గా భారత్‌ మారుతున్న ఈ తరుణంలో డేటా గోప్యత, పౌరుల ఆన్‌లైన్‌ హక్కులకు బలమైన చర్యలు చేపట్టడం ద్వారా తన డిజిటల్‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటోంది. ఐటీయూ విడుదల చేసిన జాబితా ప్రకారం..
అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. బ్రిటన్, సౌదీ అరేబియాలు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. మూడో స్థానంలో ఈస్తోనియా కనిపించింది. 
ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ నాలుగో స్థానంలో నిలవడంతో సైబర్‌భద్రతకు తాను ఎంతగా కట్టుబడి ఉందో నిరూపించుకున్నట్లయింది.
సైబర్‌ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో భారత్‌ గణనీయమైన మార్పును సాధించింది. మొత్తం 100 పాయింట్లకు గాను 97.5 పాయింట్లు పొంది ప్రపంచంలోనే పదో స్థానంలో నిలిచింది. 
ఇలా ఇచ్చారు ర్యాంకులు: న్యాయ, సాంకేతికత, సంస్థాగత చర్యలతో పాటు, సామర్థ్య అభివృద్ధి, సహకారం అనే మొత్తం అయిదు ప్రమాణాల పనితీరు ఆధారంగా జీసీఐ ఆ ర్యాంకులను ఇచ్చింది. ఈ అయిదు అంశాల్లో అన్ని దేశాల పనితీరును ఒక ప్రశ్నావళి ఆధారిత ఆన్‌లైన్‌ సర్వే ద్వారా మదింపు చేసింది. ఆ తర్వాత అందుకు తగ్గ రుజువులను సైతం సంపాదించింది. నిపుణులతో లోతైన చర్చల అనంతరం మొత్తం ర్యాంకులను ప్రకటించింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని