కొవిడ్‌పై పారిశ్రామిక పోరు - Industrial war on covid
close

Published : 10/05/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌పై పారిశ్రామిక పోరు

దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ఉదారత

దిల్లీ: రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులతో ప్రపంచంలోనే భారత్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కొవిడ్‌పై పోరుకు దేశీయ కార్పొరేట్‌ దిగ్గజాలతో సహా అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలూ తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఇతర దేశాల నుంచి అవసరమైన వైద్య పరికరాలను వాయు మార్గంలో భారత్‌కు చేర్చడం దగ్గర్నుంచి, మెడికల్‌ ఆక్సిజన్‌ను తయారు చేయడం, ప్రజారోగ్య వ్యవస్థకు తోడ్పాటుగా ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నాయి.
* అమెజాన్‌, గూగుల్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు, టాటా సన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ గ్రూప్‌ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు ప్రత్యేకంగా కొవిడ్‌ ఆసుపత్రుల్ని నిర్మించాయి. మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాలో కీలకమైన క్రయోజెనిక్‌ ట్యాంకర్లను ఇతర దేశాల నుంచి వాయు మార్గంలో భారత్‌కు తరలించాయి. ఇవే కాకుండా ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించాయి.

అంతర్జాతీయంగా..
* గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ గత నెలలో 18 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.135 కోట్లు) విరాళం ప్రకటించారు.
* అమెజాన్‌ 1,000 మెడ్‌ట్రానిక్‌ వెంటిలేటర్లను భారత్‌కు పంపించనున్నట్లు తెలిపింది.
* 1,000 వెంటిలేటర్లు, 25,000 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ పరికరాలను భారత్‌కు అందించడంలో పాలు పంచుకుంటున్నామని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.
* వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ 20 ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్లను, 20 క్రయోజెనిక్‌ కంటెయినర్లను సరఫరా చేసింది.

దేశీయంగా..
* ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ చమురు రిఫైనరీల్లో రోజుకు 1,000 టన్నులకు పైగా మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తోంది. మొత్తం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌లో ఇక్కడి నుంచే 11 శాతానికి పైగా ఉంది. ప్రతి 10 మంది రోగుల్లో ఒకరికి ఈ ఆక్సిజనే అందుతోంది. అలాగే 1,875 పడకలతో జామ్‌నగర్‌లో కొవిడ్‌ ఆసుపత్రి నిర్మించి సేవలు అందిస్తోంది. ఆక్సిజన్‌ సరఫరా కోసం 24 ఐఎస్‌ఓ కంటెయినర్లను కూడా వాయుమార్గంలో తీసుకొచ్చింది.
* జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఉక్కు ఉత్పత్తుల్ని నిలిపివేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, తమ ప్లాంట్ల చుట్టూ కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రవాణా ఇబ్బందులు లేకుండా పైప్‌లైన్‌ ద్వారా ఈ కేంద్రాలకు సులువుగా ఆక్సిజన్‌ అందించవచ్చనే ప్రణాళికతో ముందుకెళుతోంది.
* విప్రో, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లు పుణెలోని ఐటీ కేంద్రాన్ని 430 పడకల ఇంటర్మీడియరీ కేర్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేశాయి.
* నారాయణ హెల్త్‌తో కలిసి ఇన్ఫోసిస్‌ బెంగళూరులో 100 గదుల కొవిడ్‌ ఆసుపత్రిని నిర్మించి పేద వారికి ఉచితంగా సేవలు అందిస్తోంది.
* కొవిడ్‌ ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటులో సిప్లా మహారాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించింది.
* దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఓ ఫీల్డ్‌ ఆసుపత్రిని వేదాంతా నిర్మిస్తోంది.
* గుజరాత్‌లో అదానీ ఫౌండేషన్‌ ఆసుపత్రుల్ని ఏర్పాటు చేస్తోంది. అహ్మదాబాద్‌లో ఉన్న అదానీ విద్యా మందిర్‌ పాఠశాలను అత్యవసర కొవిడ్‌ కేర్‌ కేంద్రంగా మార్చింది. ఇక్కడ రోగులకు ఆక్సిజన్‌, ఆహార ఇబ్బందులు లేకుండా చూస్తోంది.
* టాటా గ్రూప్‌ తమ కంపెనీల ద్వారా కొవిడ్‌ బాధితుల కోసం 5,000 పడకల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు రోజుకు 900 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు 1,000 క్రయోజెనిక్‌ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది.
* ఐటీసీ 200 పడకలతో పశ్చిమ బెంగాల్‌లోని కిశోర్‌ భారతీ స్టేడియంలో 72 గంటల్లోనే తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేసింది.
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా 1,000 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 250 ఐసీయూ పడకలు, 1,000 ఐసొలేషన్‌ పడకల్ని సిద్ధం చేసింది.
* కోల్‌ ఇండియా 750 ఆక్సిజన్‌, 70 ఐసీయూ పడకలతో సహా 2,000 పడకల్ని కొవిడ్‌ బాధితుల కోసం సిద్ధం చేసింది. తమ రెండు అనుబంధ సంస్థల ద్వారా 2 ఆక్సిజన్‌ జనరేటింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించింది.
* అదానీ గ్రూప్‌ 48 క్రయోజెనిక్‌ ట్యాంకులను సౌదీ అరేబియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, తైవాన్‌, యూఏఈల నుంచి కొనుగోలు చేసింది.
* టెక్‌ మహీంద్రా 20 ఆసుపత్రులకు పైగా వెంటిలేటర్ల వంటి వైద్య పరికరాలను అందించింది.
* దేశంలో అవసరమైన ఆసుపత్రులకు 22 ఆక్సిజన్‌ జనరేటర్లను ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ సరఫరా చేసింది.
* తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంఈఐఎల్‌ గ్రూప్‌ డీఆర్‌డీఓ, ఐటీసీ భద్రాచలంతో ఒప్పందాలు చేసుకుని, రోజుకు 35 లక్షల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని