యువ‌త పొదుపు చేయాలిసిన అయిదు పథ‌కాలు - Investing-tips-for-young-earners
close

Updated : 29/01/2021 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువ‌త పొదుపు చేయాలిసిన అయిదు పథ‌కాలు

సాధార‌ణంగా ఉద్యోగ‌స్తుల‌కు నెలవారీ జీతం అందుతుంది. ఆ ఆదాయంలో వారికి స‌రిప‌డ ఖ‌ర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి. దీనికి కొన్ని ర‌కాల మార్గాల‌ను ఎంచుకోవ‌డం ద్వారా జీవితాన్నిసాఫీగా చేసుకోవ‌చ్చు. ఉద్యోగుల‌కు సంబంధించి ఐదు ముఖ్య‌మైన ఆర్థిక స‌ల‌హాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు:

క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు సిప్ విధానంలో ఈక్విటీ సంబంధిత మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం. కొత్త‌గా ఉద్యోగం లో చేరిన యువ‌కుల‌కు ఉండే భాద్య‌త‌లు త‌క్కువ‌గానే ఉంటాయ‌ని చెప్పాలి. కాబ‌ట్టి కొంత రిస్క్ ఉన్న ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు. పెట్టుబ‌డి కూడా నెల‌వారీ క్ర‌మానుగ‌తంగా చేస్తే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఏడాదికోసారి డ‌బ్బు మొత్తంగా పెట్టుబ‌డి పెట్టే బ‌దులు సిప్ విధానం మేల‌ని చెప్పాలి. ఈక్విటీ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం ద్వారా పెట్టుడుల‌కు వైవిధ్య‌త ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం మోస్త‌రుగా ఉండి రాబ‌డి కూడా మెరుగ్గా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా మార్కెట్లో నెల‌కొన్న అస్థిత‌ర‌త‌ను అదిగ‌మించొచ్చు.

ఫిక్సిడ్ డిపాజిట్లు (లేదా) రిక‌రింగ్ డిపాజిట్లు:

ఫిక్సిడ్ డిపాజిట్ల‌ను న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉన్న పెట్టుబ‌డి సాధ‌నంగా చెప్ప‌వ‌చ్చు. దీని ద్వారా హామీతో కూడిన రాబ‌డి ఉంటుంది. సాధార‌ణ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల కంటే ఫిక్సిడ్ డిపాజిట్ల‌లో వ‌డ్డీ రేటు అధికంగా ఉంటుంది. అత్య‌వ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేందుకు కొంత నిధిని ఉంచుకోవ‌డం మంచిది. రిక‌రింగ్ డిపాజిట్ ద్వారా అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. దీనికి లిక్విడిటీ ఎక్కువ‌గా ఉంటుంది.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్):

పీపీఎఫ్ భ‌ద్ర‌త క‌లిగిన పెట్టుబ‌డి సాధ‌నంగా చెప్ప‌వ‌చ్చు. దీనికి లాక్ ఇన్ పిరియ‌డ్ 15 సంవ‌త్స‌రాలు ఉంటుంది. పీపీఎఫ్ లో పొదుపు చేసిన మ‌దుపు స్వ‌ల్ప‌కాల అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌దు కానీ దీర్ఘ‌కాలంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం పీపీఎఫ్ ప‌థ‌కంలో వ‌డ్డీరేటు 7.6 శాతంగా ఉంది. ఈ ప‌థ‌కంలో పొదుపు చేసిన వారికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ప‌న్నుమిన‌హాయింపు ఉంటుంది.

పదవీ విరమణ ప్రణాళిక కోసం ఎన్‌పీఎస్:

ఉద్యోగులు కెరీర్ ప్రారంభం నుంచి ప‌ద‌వీ విరమణ కోసం ప్రణాళిక ప్రారంభించటం మంచిది. దీనికి జాతీయ పించ‌న్ ప‌థ‌కం( ఎన్‌పీఎస్) లో మ‌దుపు చేయోచ్చు. దీంట్లో పెట్టుబడులు పెట్టేవారికి ప‌న్ను ప్రయోజనాలు ఉంటాయి. ఒక వేళ మీకు అప్ప‌టికే ప‌ద‌వీవిర‌మ‌ణకు సంబంధించిన పెట్టుబ‌డులు ఉంటే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డికి నిర్దిష్ట‌మైన వ్యూహాన్ని అనుస‌రించాలి. దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డి చేసేందుకు ఎన్‌పీఎస్ ఉద్దేశించింది.పదవీ విరమణ లక్ష్యాన్ని సాధించడంతో పాటు సెక్షన్ 80సీ కింద రాబ‌డిపై పన్ను మినహాయింపు పొందొచ్చు.

బంగారంలో పెట్టుబ‌డి:

ద్రవ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించే సురక్షితమైన పెట్టుబ‌డిగా బంగారాన్ని ప‌రిగ‌ణిస్తుంటారు. బంగారు ఆభ‌ర‌ణాల రూపంలో కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) లో పెట్టుబడి చేస్తే ఏడాదికి వ‌డ్డీ 2.5శాతం ల‌భిస్తుంది. దీర్ఘ‌కాలంలో మూల‌ధ‌న వృద్ధిని కూడా పొంద‌వ‌చ్చు. బాండ్ల కాల‌ప‌రిమితి పూర్త‌య్యాక ఉస‌సంహ‌రించిన‌ట్ట‌యితే పన్ను ఉండ‌దు. కాబట్టి, వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూల‌ధ‌న వృద్ధి, పన్నుమిన‌హాయింపులు వంటి ప్రయోజనాలు పొందొచ్చు. వేతన పెట్టుబడిదారులు పెట్టుబడిని అలవాటు చేసుకోవాలి. వారు పెట్టుబడిని ప్రారంభించడానికి తగిన ఆదాయం కోసం ఎదురు చూడ‌కుండా సంపాదించే మొత్తంలో కొంత బంగారంలో పెట్టుబడి చేయాలి.

మీకొచ్చేఆదాయానికి త‌గ్గ‌ట్టుగా పెట్టుబడులు చేసే విధంగా నిర్ణయం తీసుకునేందుకు ఆర్థిక సలహాదారుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని