నెలకు  రూ.8వేలు  రావాలంటే... - Investment schemes
close

Updated : 05/03/2021 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెలకు  రూ.8వేలు  రావాలంటే...

> నేను సీనియర్‌ సిటిజన్‌ను. పింఛను వస్తోంది. సెక్షన్‌ 80సీ మినహాయింపు కోసం రూ.1,50,000 వరకూ మదుపు చేయాల్సి వస్తోంది. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవచ్చు. నష్టభయం లేకుండా ఉండాలి?    -మహేందర్‌

మీకు నష్టభయం లేకుండా.. మంచి రాబడి రావాలంటే.. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో పెట్టుబడి పెట్టండి. ఇందులో 7.4శాతం వడ్డీ లభిస్తోంది. మీకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇందులో మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. వచ్చిన ఆదాయానికి పన్ను వర్తిస్తుంది. ఐదేళ్ల వరకూ ఈ పథకంలో కొనసాగాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకన్నా ఇది మెరుగైనదిగానే చెప్పొచ్చు. 

నెలకు కనీసం 8 వేల వరకూ ఆదాయం వచ్చేలా కొంత డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. ఇది మా అమ్మ అవసరాలకు ఉపయోగపడాలి. ఇందుకోసం ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలి. జమ చేసిన మొత్తం తిరిగి రావాలి. దీనికోసం ఏం చేయాలి?  - రాజేశ్‌

నెలకు రూ.8 వేల వరకూ    రాబడి రావాలంటే.. దాదాపు 6 శాతం సగటు వడ్డీ వచ్చే పథకాల్లో రూ.16లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి రూ.4.5లక్షలు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం (ఎంఐఎస్‌)లోనూ, మిగతా   రూ.11.50లక్షలను బ్యాంకులో నాన్‌    క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. ఈ మొత్తాన్ని ఒకే  డిపాజిట్‌గా కాకుండా.. మూడు భాగాలుగా విభజించి జమ చేయండి.

మా అమ్మాయి వయసు 8 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలనేది ఆలోచన. ఈ మొత్తాన్ని పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో రూ.5వేల చొప్పున పెట్టుబడి పెట్టొచ్చా? తనకు 22 ఏళ్లు వచ్చేనాటికి మంచి మొత్తం రావాలంటే ఏం చేయాలి? - రేణుక

• సుకన్య సమృద్ధిలో ప్రస్తుతం 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. దీనికి ఎలాంటి పన్ను ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి రాబడిగానే చెప్పాలి. నెలకు రూ.5వేలు దీనికి కేటాయించవచ్చు. మిగతా రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో సుమారు 12-13శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిలో మదుపు చేయడం వల్ల సగటున 10శాతం వార్షిక రాబడి లభిస్తుందని చెప్పొచ్చు. నెలకు రూ.10వేల చొప్పున 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 10శాతం రాబడి అంచనాతో.. రూ.38,12,697 అయ్యేందుకు అవకాశం ఉంది. 

మేము రుణం తీసుకొని, ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాం.  మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అతను నా ఖాతాలో   జమ చేసిన మొత్తంతో ఈఎంఐ చెల్లించేందుకు వీలుంటుందా? దీనికోసం ఏమైనా నిబంధనలు పాటించాలా? - సాయి ప్రకాశ్‌

• మీరు తీసుకోబోయే గృహరుణానికి మీ అబ్బాయి సహదరఖాస్తుదారుడిగా ఉండాలి. అప్పుడే మీకు రుణం వచ్చేందుకు వీలుంటుంది. మీ అబ్బాయి పేరుమీద ఎన్‌ఆర్‌ఓ ఖాతాను ప్రారంభించి, ఆ బ్యాంకు ఖాతా నుంచి గృహరుణం ఈఎంఐ చెల్లించే ఏర్పాటు చేయండి.

నా వయసు 61 ఏళ్లు. ఇటీవలే పదవీ విరమణ చేశాను. ఇప్పటి వరకూ యాజమాన్యం అందించే బృంద ఆరోగ్య బీమా ఉండేది. ఇప్పుడు సొంతంగా పాలసీ తీసుకోవాలనుకుంటే సాధ్యమేనా? నాకు అధిక రక్తపోటు ఉంది. ఈ విషయాన్ని బీమా సంస్థకు  తెలియజేయాలా?  - రామచంద్ర

• ప్రస్తుతం వైద్య ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంటే చాలు.. రూ.లక్షలు ఖర్చవుతున్నాయి. మన దగ్గర ఆరోగ్య బీమా పాలసీ లేకపోతే.. కష్టపడి జమ చేసిన సొమ్ము చికిత్సకు కేటాయించాల్సిందే. ఇలాంటి పరిస్థితి రాకుండా వైద్య బీమా సహాయం చేస్తుందని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం సాధ్యమే. పాలసీ ఇచ్చేముందు మీకు వైద్య పరీక్షలు చేస్తారు.

కాబట్టి, దరఖాస్తు చేసేటప్పుడే మీకు అధిక రక్తపోటు ఉందన్న విషయాన్ని తెలియజేయండి. కొన్నిసార్లు అదనంగా వైద్య పరీక్షలనూ అడగవచ్చు. మీ వైద్య పరీక్షల నివేదికలను బట్టి,      బీమా సంస్థ పాలసీని ఇవ్వడమా.. ఇవ్వకపోవడమా అనేది    నిర్ణయిస్తుంది. పాలసీ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రీమియానికి కొంత అదనపు మొత్తాన్ని వసూలు చేయొచ్చు. - తుమ్మ బాల్‌రాజ్‌ 

ఇవీ చదవండి..

ఆర్థిక భరోసాకు అడుగులివే...

అమెరికా షేర్లలో మదుపు...


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని