ఈక్విటీ ఫండ్‌లలో పెట్టుబడులు 40% తగ్గాయ్‌ - Investments in equity funds fell by 40 percent
close

Published : 09/07/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈక్విటీ ఫండ్‌లలో పెట్టుబడులు 40% తగ్గాయ్‌

 జూన్‌లో రూ.5,988 కోట్లకు పరిమితం: యాంఫీ

దిల్లీ: జూన్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోకి పెట్టుబడులు 40 శాతం క్షీణించి రూ.5,988 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాక్‌ మార్కెట్లు రాణిస్తుండటంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మేలో ఈక్విటీ ఫండ్‌ పథకాల్లోకి రూ.10,083 కోట్ల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. గత 14 నెలల్లో ఇదే అత్యధికం. ఏప్రిల్‌లో రూ.3,437 కోట్లు, మార్చిలో రూ.9,115 కోట్ల మేర ఈక్విటీ ఫండ్‌ పథకాల్లో మదుపర్లు పెట్టుబడులుగా పెట్టారని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. మార్చికి ముందు 8 నెలల్లో అంటే జులై 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు మదుపర్లు ఈక్విటీ ఫండ్‌ పథకాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది జూన్‌లో డెట్‌ ఫండ్‌ పథకాల్లో రూ.3,566 కోట్లను మదుపర్లు పెట్టుబడిగా పెట్టగా.. మే నెలలో రూ.44,512 కోట్లను వెనక్కి తీసుకున్నారు. పసిడి ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లలోకి కిందటి నెలలో రూ.360 కోట్లు రాగా.. మేలో ఇది రూ.288 కోట్లుగా ఉంది. జూన్‌లో అన్ని రకాల ఫండ్‌ పథకాలకు సంబంధించి నికరంగా రూ.15,320 కోట్లను మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ఆకర్షించింది. మేలో అన్ని ఫండ్‌ పథకాల నుంచి రూ.38,602 కోట్లను మదుపర్లు ఉపసంహరించుకున్నారు. జూన్‌ చివరినాటికి మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ జీవన కాల గరిష్ఠమైన రూ.33.67 లక్షల కోట్లకు చేరింది. మేలో ఇది రూ.33 లక్షల కోట్లుగా నమోదైంది.  


కమొడిటీ కాంట్రాక్టుల్లో మార్పులేవైనా 10 రోజుల ముందుగా చెప్పాలి
 కాలపరిమితిని తగ్గించిన సెబీ

దిల్లీ: కమొడిటీ డెరివేటివ్‌ కాంట్రాక్టులకు సంబంధించి ఎక్స్ఛేంజీలు ఏమైనా మార్పులు చేయాలంటే ముందస్తుగా తెలియజేయాల్సిన సమయాన్ని సెబీ తగ్గించింది. ‘స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో సంప్రదింపుల అనంతరం మూడు విభాగాల్లో (ఏ, బీ, సీ)ని మార్పులను ముందస్తుగా తెలియజేయాల్సిన సమయాన్ని 10 రోజులకు తగ్గించినట్లు’ సెబీ వెల్లడించింది. కమొడిటీ కాంట్రాక్టుల్లో మార్పులు చేయాలంటే తగు కారణాలతో ముందస్తుగా సెబీకి, మార్కెట్‌ పార్టిస్పెంట్లకు ఎక్స్ఛేంజీలు తెలియజేయాల్సి ఉంటుంది.   ప్రస్తుతం ‘ఏ’ విభాగంలో మార్పులను 10 రోజులు ముందుగా తెలియజేయాల్సి ఉండగా.. బీ, సీ విభాగాలకు ఇది 30 రోజులుగా ఉంది. ఇప్పుడు అన్ని విభాగాలకు 10 రోజులు ముందుగా తెలియజేసేలా నిబంధనలను సెబీ సడలించింది. కాంట్రాక్టుల్లో మార్పులను మూడు విభాగాలుగా (ఏ, బీ, సీ) 2019 నవంబరులో సెబీ వర్గీకరించిన సంగతి తెలిసిందే. టిక్కర్‌ గుర్తు, గరిష్ఠ ఆర్డరు పరిమాణం, మూల మార్జిన్‌, గరిష్ఠ నష్ట మార్జిన్‌ లాంటి వాటిల్లో చేసే మార్పులను మొదటి విభాగంలో చేర్చింది. ప్రస్తుతం నడుస్తున్న కాంట్రాక్టులకే కాదు.. ప్రారంభించాల్సిన కాంట్రాక్టులకు సంబంధించి పై తరహా ఏ మార్పులైనా ‘ఏ’ విభాగంలోకి వస్తాయి. ప్రారంభించాల్సిన కాంట్రాక్టులు లేదా సున్నా ఓపెన్‌ ఇంట్రస్ట్‌ ఉన్న కాంట్రాక్టులకు సంబంధించి మెటీరియల్‌ మోడిఫికేషన్లను రెండో విభాగంలోకి సెబీ చేర్చింది. కాంట్రాక్టులను ఎప్పుడు ప్రారంభిస్తారు, ట్రేడింగ్‌ కాలపరిమితి, రోజువారీ ధర పరిమితి లాంటి వాటికి సంబంధించిన మార్పులు మూడో విభాగం కిందకు వస్తాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని