close

Updated : 20/04/2021 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంట్లో హెల్త్‌ ఎమర్జెన్సీయా..?

ఇలా డబ్బు సమకూర్చుకోండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలే కరోనా పుణ్యమా అని అనేక మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరైనా కొవిడ్‌ బారిన పడినా.. లేక ఇతర అనారోగ్యానికి గురైనా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కానీ, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యమే నిజమైన సంపద. తొలి ప్రాధాన్యం కచ్చితంగా ఆరోగ్యానికి ఇవ్వాల్సిందే. కాబట్టి ఇంట్లో ఆరోగ్య అత్యసరసర పరిస్థితి ఏర్పడితే వీలైనంత త్వరగా నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న కొన్ని మార్గాలపై లుక్కేద్దాం. 

కార్డు స్వైప్‌ చేయండి...

చాలా ఆస్పత్రుల్లో వివిధ రకాల కార్డులను అనుమతిస్తారు. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ తొలుత కొంత సొమ్ము మనం చేతి నుంచి కట్టాల్సి రావొచ్చు. కార్డ్‌తో అయితే పని వెంటనే అయిపోతుంది. అయితే, వడ్డీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సాధారణం 39-40 శాతం వరకు ఛార్జ్‌ చేస్తుంటారు. అయితే, దీన్ని తర్వాత రుణ రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉందేమో కనుక్కొని వినియోగించుకోండి. లేదా సులభ వాయిదాల(ఈఎంఐ) కిందికి మార్చుకోండి. 

వ్యక్తిగత రుణం..

చాలా మంది ఖాతాదారులకు తమ బ్యాంకుల్లో ఎంతో కొంత ‘ముందస్తు ఆమోదిత-(ప్రీ అప్రూవ్‌డ్)’ రుణ వెసులుబాటు ఉంటుంది. ఆ పరిమితి లోపైతే చాలా తక్కువ పత్రాలతో వీలైనంత త్వరగా రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీ-అప్రూవ్‌డ్‌ లోన్‌ వసతి లేనట్లయితే.. కేవైసీ తీసుకొని వీలైనంత త్వరగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఇక్కడ వడ్డీ రేటు 9-26 శాతం వరకు ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎక్కువ బేరమాడకుండా త్వరగా రుణం చేతికి వచ్చే మార్గాలపైనే దృష్టి సారించండి. వడ్డీ కోసం బేరాలాడుతూ కూర్చుంటే ప్రక్రియ ఆలస్యమై డబ్బు చేతికందేందుకు సమయం పట్టొచ్చు. 

బంగారాన్ని తనఖా పెట్టండి...

బంగారాన్ని తనఖా పెట్టి రుణం పొందడం త్వరగా అయ్యే పని. ఎలాగూ కొంత విలువ గల మన సొమ్ము వారి దగ్గర పెడుతున్నాం కాబట్టి వీలైనంత త్వరగా రుణం మంజూరు చేస్తారు. క్రెడిట్‌ స్కోర్‌ తక్కువ ఉన్నా.. రుణం పొందే అర్హత లేకపోయినా బంగారం తనఖా పెడితే సంస్థలు రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు వస్తాయి. ఎక్కువ పత్రాలు కూడా అవసరం లేకపోవచ్చు. కొన్ని గంటల్లోనే మన చేతికి డబ్బులు అందే అవకాశం ఉంటుంది. సాధారణంగా వడ్డీ రేటు 7-29 శాతం వరకు ఉంటుంది.

సెక్యూరిటీలపై రుణం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న సమయంలో మనం పెట్టిన పెట్టుబడులు, మదుపు ఇప్పుడు మనకు రుణాల రూపంలో సాయపడొచ్చు. మ్యూచువల్‌ ఫండ్లు, ఈక్విటీ షేర్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ పథకాల వంటి వాటిపై మనం రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ మనం ముందే చాలా వరకు పత్రాలు సమర్పించి ఉంటాం. కాబట్టి పెద్దగా పత్రాలు, ప్రక్రియ లేకుండా చాలా తక్కువ సమయంలో రుణం పొందే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకును సంప్రదించి రుణం పొందే వెసులుబాటు ఉందేమో కనుక్కని డబ్బు పొందండి.

చివరగా ఈపీఎఫ్‌..

మన పీఎఫ్‌ ఖాతాలో జమయిన డబ్బుల్ని తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ, దీన్ని చివరి ప్రత్యామ్నాయంగా చూడండి. ఎందుకంటే ఇది రిటైర్‌మెంట్‌ కోసం మదుపు చేస్తున్న సొమ్ము. అప్పటి అవసరాలు, లక్ష్యాలు ఏంటో మనకు ఇప్పుడే తెలియదు. దీన్ని అత్యవసరమైతే తప్ప ముట్టుకోకపోవడమే మంచిది. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో సొమ్ము మన చేతికి వస్తుంది. అయితే, రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసిన సొమ్ము, దానిపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఇప్పుడు పన్ను విధిస్తున్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని