JSW Steel: స్టీల్‌ విక్రయాలపై సర్‌ఛార్జి విధించే యోచనలో జేఎస్‌డబ్ల్యూ - JSW Steel plans to levy surcharge steel products
close

Published : 24/10/2021 21:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

JSW Steel: స్టీల్‌ విక్రయాలపై సర్‌ఛార్జి విధించే యోచనలో జేఎస్‌డబ్ల్యూ

దిల్లీ: ముడిసరకు ధరలు, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు దేశీయ ఉక్కు దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తెలిపింది. ఓఈఎం(ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌) కస్టమర్లు తమ కంపెనీ నుంచి చేసే కొనుగోళ్లపై సర్‌ఛార్జి విధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని కంపెనీ సీఎఫ్‌ఓ, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేషగిరి రావు వెల్లడించారు. ప్రధాన స్టీల్‌ తయారీ కంపెనీల నుంచి స్టీల్‌ను కొనుగోలు చేసి ఇతర పరికరాల ఉత్పత్తి లేదా మార్కెటింగ్‌ చేసే సంస్థల్ని ఓఈఎం కస్టమర్లు అంటారు.

ఇటీవల తయారీ వ్యయం భారీగా పెరిగిందని శేషగిరి రావు తెలిపారు. త్రైమాసిక ప్రాతిపదికన ఒక టన్ను ఉక్కు ఉత్పత్తి వ్యయం 19 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఉక్కు తయారీలో ప్రధానంగా వినియోగించే కోల్‌-కోక్‌ను పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నామని.. దీని ధర టన్నుకు 120 డాలర్ల నుంచి 400 డాలర్లకు పెరిగిందని వెల్లడించారు. ఈ స్థాయి పెరుగుదలను భరించడం కష్టతరమన్నారు. ఐరోపాలో ఓ స్టీల్‌ కంపెనీ 50 యూరోల సర్‌ఛార్జి విధిస్తోందని తెలిపారు. యూకేలో మరో కంపెనీ 25 పౌండ్లు విలువ చేసే రెండు రకాల సర్‌ఛార్జిలను విధిస్తోందన్నారు.

భారత స్టీల్‌ మార్కెట్‌కు సర్‌ఛార్జి కొత్తది అయినప్పటికీ.. అంరత్జాతీయ మార్కెట్లో ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉందని శేషగిరి రావు తెలిపారు. అయితే, దీన్ని అమలు చేయడం ఎంత వరకు సాధ్యమవుతుందన్నది చూడాల్సి ఉందన్నారు. రిటైల్‌, ఎగుమతులు, ఓఈఎం.. ఈ మూడు మార్గాల్లో స్టీల్‌ విక్రయాలు జరుగుతున్నాయన్నారు. రిటైల్‌ మార్కెట్లో ధరలు రోజురోజుకి మారుతాయని.. ఈ విభాగంలో సర్‌ఛార్జి విధించే అవకాశం లేదన్నారు. ఇక ఎగుమతుల ధరల్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ఓఈఎం కస్టమర్లపై మాత్రమే సర్‌ఛార్జి విధించాల్సి వస్తుందని పేర్కొన్నారు. సర్‌ఛార్జి విధింపు ఆవశ్యకతపై వారికి వివరించి.. వారి ఆమోదం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని