జాక్‌ మాను పక్కనపెట్టేసిన చైనా - Jack MA Name missing in pioneer tech list
close

Updated : 02/02/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాక్‌ మాను పక్కనపెట్టేసిన చైనా

బీజింగ్‌: అనవసరంగా నోరుజారి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు  అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా. ఇప్పటికే ఆయన కంపెనీలపై డ్రాగన్‌ గట్టి నిఘా పెట్టగా.. తాజాగా ఆయనను టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా పక్కనబెట్టేశారు. 

చైనా అధికారిక మీడియా సంస్థ షిన్జువా న్యూస్‌ ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీ న్యూస్‌ పత్రిక మంగళవారం తమ దేశ టెక్‌ దిగ్గజాలపై ఓ కథనం ప్రచురించింది. అయితే ఇందులో జాక్‌ మా పేరు లేదు. అదే సమయంలో అలీబాబా ప్రత్యర్థి సంస్థ అయిన టెన్సెంట్‌ సీఈవో పోనీ మా పై మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. సాంకేతికతలో పోనీ మా చరిత్ర తిరగరాస్తున్నారంటూ షాంఘై సెక్యూరిటీస్‌ రాసుకొచ్చింది. జాబితాలో బీవైడీ కో. ఛైర్మన్‌ వాంగ్‌ చువాన్‌ఫు, షావోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్‌, హువావే అధినేత రెన్‌ జెంగ్‌ఫెయ్‌ తదితర దిగ్గజ వ్యాపారవేత్తల పేర్లున్నాయి. 

కొద్ది నెలల క్రితం ప్రభుత్వానికి సలహాలివ్వబోయి జాక్‌ మా.. చైనా పాలకుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. ఇంకేముంది.. జాక్‌ మా వ్యాఖ్యలపై మండిపడ్డ డ్రాగన్‌.. ఆయనపై ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, ఆయనకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవోను అడ్డుకొంది. ఈ పరిణామాల తర్వాత నుంచి జాక్‌ మా బయటి ప్రపంచానికి కన్పించకుండా పోయారు. దీంతో ఆయన అదృశ్యంపై అనేక అనుమానాలు తలెత్తాయి. 

ఇదిలా ఉండగా.. కొద్ది వారాల క్రితం జాక్ మా ‘వర్చువల్‌’గా ప్రత్యక్షమయ్యారు. రూరల్‌ టీచర్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నట్లు ఆ దేశ మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ ప్రకటించింది. 

ఇదీ చదవండి..

డ్రాగన్‌ బుసలపై పెద్దన్న గుస్సా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని