జాగ్వార్‌ నుంచి అన్నీ విద్యుత్‌కార్లే - Jaguar to go all electric
close

Updated : 23/02/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాగ్వార్‌ నుంచి అన్నీ విద్యుత్‌కార్లే

ప్రణాళిక సిద్ధం చేసిన కొత్త అధిపతి 

ముంబయి: 2025 నుంచి జాగ్వార్‌ బ్రాండ్‌పై కేవలం విద్యుత్‌ కార్లే ఉత్పత్తి చేయడానికి సిద్ధమైనట్లు జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ కొత్త అధిపతి థియరీ బొలోరె పేర్కొన్నారు. టాటా గ్రూప్‌ కంపెనీలతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. 2030 కల్లా మొత్తం జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌లో పూర్తి స్థాయి విద్యుత్‌ ఉత్పత్తులనే అందించాలని శనివారం విడుదల చేసిన ‘రీఇమాజిన్‌ స్ట్రాటజీ’లో తెలిపారు. 

ఇందులో భాగంగా..2024లో పూర్తి స్థాయి విద్యుత్‌ మోడల్‌ను కంపెనీ విడుదల చేయనుంది. వచ్చే అయిదేళ్లలో 6 పూర్తి స్థాయి విలాసవంత విద్యుత్‌ స్పోర్ట్‌ వినియోగ (ఎస్‌యూవీ) వాహనాలను తీసుకురానుంది. దశాబ్దకాలంలో తన సరఫరా వ్యవస్థ, ఉత్పత్తులు, కార్యకలాపాలన్నిటిలోనూ కర్బన ఉద్గారాలను సున్నాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. లాండ్‌ రోవర్, జాగ్వార్‌ బ్రాండ్ల విద్యుదీకరణ వేర్వేరు వ్యూహాల్లో, నిర్మాణంలో ఉంటాయని కంపెనీ వివరించింది. భవిష్యత్‌లో రాబోతున్న మాడ్యుల్‌ లాంగిట్యూడినల్‌ ఆర్కిటెక్చర్‌ను లాండ్‌రోవర్‌ వినియోగించుకోనుంది. తద్వారా ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్లు, పూర్తి స్థాయి విద్యుత్‌ వేరియంట్లను విడుదల చేయడానికి వీలవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్‌ మాడ్యులర్‌ ఆర్కిటెక్చర్‌ను అధునాతన ఎలక్ట్రిఫైడ్‌ గ్యాసోలిన్‌ ఇంజిన్‌లకు ఉపయోగించుకోనుంది. 


‘అంతర్గతంగా గొప్ప వనరులు’


జాగ్వార్‌ మోడళ్లను వెస్ట్‌ మిడ్‌లాండ్స్‌లోని సొలిహల్‌ ప్లాంటులో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌లో ప్రత్యేకంగా తయారు చేయనున్నారు. హైడ్రోజెన్‌ ఫ్యూయల్‌ బ్యాటరీని అందిపుచ్చుకునేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ప్రొటోటైప్స్‌ వచ్చే 12 నెలల్లోగా బ్రిటన్‌లో ఉంటాయని తెలిపింది. అదే సమయంలో టాటా గ్రూప్‌ కంపెనీలతో పరిజ్ఞానాన్ని పంచుకునే విషయంలో సహకారం ఉంటుందని తెలిపింది. ‘ఇతర కంపెనీలు బయటి సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటుంటాయి. మాకు అంతర్గతంగానే గొప్ప వనరులున్నాయ’ని థియరీ బొలోరె పేర్కొన్నారు. ప్రస్తుతం జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌లో డీజిల్, పెట్రోలు మోడళ్లతో పాటు పూర్తి స్థాయి విద్యుత్, ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్, మైల్డ్‌ హైబ్రిడ్‌ వాహనాలు ఉన్నాయి. 2025 కల్లా రెండంకెల ఎబిట‌(వడ్డీ, పన్నులకు ముందు ఆదాయం); సున్నా అప్పులకు చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి...
రూ.5.45 లక్షలతో రెనో కైగర్‌ కారు

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని