Jet Airways: వచ్చే ఏడాది ఎగరనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌  - Jet Airways to resume domestic services in Q1 of 2022 Jalan Kalrock
close

Updated : 13/09/2021 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jet Airways: వచ్చే ఏడాది ఎగరనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ 

దిల్లీ: రుణ ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ ఎగరనున్నాయని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. దిల్లీ-ముంబయి మార్గంలో తొలి విమానాన్ని నడపనున్నట్లు తెలిపింది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్‌లో దక్కించుకున్న జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జెట్‌ కార్యకలాపాల పునరుద్ధరణకు కన్సార్టియం చర్యలు వేగవంతం చేసింది. ‘‘2022 తొలి త్రైమాసికం నాటికి దేశీయ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0 లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో తక్కువ దూరం ఉండే అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం’’ అని కన్సార్షియం లీడ్‌ మెంబర్‌ మురళీ లాల్‌ జలాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

రెండేళ్లకు పైగా మూతబడిన ఓ విమానయాన సంస్థ తిరిగి మళ్లీ కార్యకలాపాలు సాగించడం విమానయాన చరిత్రలో ఇదే తొలిసారి అని, ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని మురళీ జలాన్‌ తెలిపారు. ఇక జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0లో కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ముంబయి నుంచి దిల్లీకి మార్చినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి దిల్లీ నుంచి ముంబయికి తొలి జెట్‌ఎయిర్‌వేస్‌ విమానాన్ని నడుపుతామని ధీమా వ్యక్తం చేశారు.

అప్పుల బాధతో 2019 ఏప్రిల్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్‌, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. ఈ కన్సార్షియం ఇటీవల రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఉద్యోగులకు జెట్‌ ఎయిర్‌వేస్ చెల్లించాల్సిన రూ.12,000 కోట్లను రానున్న ఐదేళ్లలో చెల్లిస్తామని రుణ పరిష్కార ప్రక్రియలో కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించింది. ఇందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని