వారంలో ₹500కోట్లు నష్టపోయిన ఝున్‌ఝున్‌వాలా - Jhunjhunwala lost rs 500 cr in this week due to market weakness
close

Updated : 24/04/2021 23:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో ₹500కోట్లు నష్టపోయిన ఝున్‌ఝున్‌వాలా

మార్కెట్ల పతనంతో తగ్గిన 3 కంపెనీల వాటాల విలువ

ముంబయి: ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండు శాతం మేర నష్టపోయాయి. దీంతో సామాన్య మదుపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. షేర్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌గా పేరుగాంచిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సైతం ఈ వారం మార్కెట్ల పతనానికి నష్టాలను చవిచూశారు. మూడు కంపెనీల్లో ఆయన వాటాల విలువ రూ.506 కోట్ల మేర తగ్గిపోయింది. 

ఆయన ఫెవరెట్‌ అయిన టైటాన్‌ కంపెనీయే ఈ వారం ఆయనకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు ఆయన సతీమణి రేఖాతో కలిపి 4.49 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయి. ఇది ఆ కంపెనీ వాటాలో 5.1 శాతం. ఈ వారం టైటాన్‌ కంపెనీ షేరు విలువ 5.23 శాతం కుంగింది. దీంతో ఈ వారం మొదట్లో రూ.6,955 కోట్లుగా ఉన్న ఝున్‌ఝున్‌వాలా టైటాన్‌ వాటాల విలువ వారం ముగిసే నాటికి రూ.6,591 కోట్లకు పడిపోయింది. దీంతో ఆయనకు టైటాన్ ద్వారా రూ.364 కోట్ల నష్టం వాటిల్లినట్లయింది.

ఇక ఝున్‌ఝున్‌వాలాకు నష్టాలు తెచ్చి పెట్టిన మరో కంపెనీ టాటా మోటార్స్‌. ఈ కంపెనీలో ఆయనకు 4.27 కోట్ల షేర్లున్నాయి. ఈ సంస్థ షేరు విలువ 5.42 శాతం నష్టపోవడంతో ఝున్‌ఝున్‌వాలాకు ఉన్న టాటా మోటార్స్‌ వాటాల విలువ రూ.1,325 కోట్ల నుంచి రూ.1,252 కోట్లకు తగ్గింది. దీంతో రూ.73 కోట్లు నష్టపోయారు. ఇక చివరగా ఎస్కార్ట్‌ షేరు విలువ ఈ వారం 8.7 శాతం కుంగడంతో ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు ఉన్న వాటా విలువ రూ.69 కోట్లు తగ్గి రూ.728 కోట్లకు చేరింది. 

అయితే, కొన్ని కంపెనీలు బిగ్‌ బుల్‌కు ఈ వారం లాభాలు కూడా తెచ్చిపెట్టాయి.  ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ద్వారా రూ.11.88 కోట్లు, నజారా టెక్‌ ద్వారా రూ.24.7 కోట్లు సంపాదించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని