స్వ‌యంగా ఆర్థిక ప్ర‌ణాళిక వేస్తున్నారా.. వీటిని ముందే అంచ‌నా వేయండి  - Key-Assumptions-in-Financial-Planning
close

Updated : 21/06/2021 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వ‌యంగా ఆర్థిక ప్ర‌ణాళిక వేస్తున్నారా.. వీటిని ముందే అంచ‌నా వేయండి 

మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌ను స్వ‌యంగా మీరే డిజైన్ చేసుకుంటున్నారా? ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లు పెట్టుబ‌డులు చేయ‌డంలో స్ప‌ష్ట‌త లోపిస్తుందా? ఆర్థిక ప్ర‌ణాళిక గ‌జిబిజిగా ఉందా? అయితే ఇది మీ కోస‌మే.

నిపుణులు స‌హాయం లేకుండా స్వ‌యంగా ఆర్థిక ప్ర‌ణాళిక రూపొందించుకుని పెట్టుబ‌డులు చేసే వారు, భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వ‌కుండా కొన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ద్ర‌వ్యోల్భ‌ణం, పెట్టుబ‌డుల‌పై రాబ‌డి,  ఆదాయంపై వార్షిక వృద్ధి వంటి ప‌లు అంశాలు భవిష్య‌త్తులో ఎలా ఉంటాయో, ఏవిధంగా మార‌తాయో అంచ‌నా వేసి.. త‌గిన విధంగా ప్ర‌ణాళిక చేయాలి పెట్టుబ‌డులను ఎంచుకోవాలి.
 
1. రాబ‌డి ఎలా ఉంటుంది..
మీ అంచ‌నాల ఆధారంగా ఆర్థిక ప్ర‌ణాళిక‌లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కి, 15 సంవ‌త్స‌రాల‌లో రూ.1 కోటి రూపాయ‌లు నిధిని ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారు అనుకుందాం. ఇందుకోసం సిప్‌(సిస్ట‌మేటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్‌) విధానం ద్వారా ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డి పెడుతున్నారు అనుకుందాం. ఇందులో మీరు 10శాతం రాబ‌డిని అంచ‌నా వేస్తే, ప్ర‌తీ నెల‌ రూ.24వేలు పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. అదే 15శాతం రాబ‌డిని అంచ‌నా వేస్తే నెల‌కు రూ.15వేలు పెట్టుబ‌డి పెడితే స‌రిపోతుంది. 

సాధారణంగా గ‌త చ‌రిత్ర ఆధారంగా పెట్టుబ‌డిల‌పై రాబ‌డిని అంచ‌నా వేస్తుంటారు. మీరు తీసుక‌న్న డేటా ప్ర‌కారం చూస్తే ఆయా పెట్టుబ‌డుల‌పై మంచి రాబ‌డి వ‌చ్చి ఉండ‌చ్చు. కానీ ప్ర‌తీసారి అదే ఖ‌చ్చిత‌మైన వృద్ధి ఉంటుంద‌ని చెప్ప‌లేము. ఇది ఆర్థిక ప్ర‌ణాళికపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతుంది. మీరు అంచనా వేసిన వేరువేరు సంఖ్య‌లు స‌త్ఫ‌లితాన్ని ఇస్తాయ‌ని నిర్ధారించ‌డం క‌ష్ట‌మే.   

"ఆర్థిక ప్రణాళిక ఎప్పుడూ ఖచ్చితమైనది కాదు. అందువ‌ల్ల‌ మార్పుచెందుతున్న‌ ఆర్థిక, పెట్టుబడి ట్రెండ్‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా అనుసరిస్తుండాలి. మూడు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారైనా వీటికి త‌గిన‌ట్లుగా  మార్పులు చేస్తుండాలి." అని  సెబీ-రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (సెబీ-ఆర్‌ఐఏ), లాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వైజర్‌, వ్యవస్థాపకుడు సురేష్ సదాగోపన్ అన్నారు.

2. ద్రవ్యోల్బణం..
ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్స్‌.. మ‌దుప‌ర్ల‌ లక్ష్యాన్ని బట్టి వేర్వేరు ద్రవ్యోల్బణ రేట్లు అంచ‌నావేసి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కి  పిల్లల విద్య కోసం పొదుపు చేయ‌డం ల‌క్ష్యం అయితే, చాలా మంది సలహాదారులు 8 నుంచి10 శాతం ద్రవ్యోల్బణం ఉండ‌చ్చ‌ని అంచ‌నా వేస్తారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం ఉన్న‌త చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చు ఆస్థాయిలో పెరుగుతుంది.  ఒక‌వేళ పెట్టుబ‌డిదారుడు భ‌విష్య‌త్తు వైద్య ఖ‌ర్చుల కోసం మ‌దుపు చేస్తుంటే..  ఇదే శాతం ద్ర‌వ్య‌ల్భ‌ణం అంచ‌నా వేయాలి.

ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం అయితే 6 నుంచి7 శాతం  వార్షిక ద్ర‌వ్యోల్భ‌ణాన్ని ఊహించ‌వ‌చ్చు. స‌మీప లక్ష్యాల కోసం మ‌దుపు చేసేవారు కొన్ని సంద‌ర్భాల్లో ద్ర‌వ్యోల్భ‌ణాన్ని లెక్కించాల్సిన అవ‌స‌రం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు,  ఒక వ్య‌క్తి వ‌చ్చే సంవ‌త్స‌రం విహారయాత్ర‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నా లేదా వ‌చ్చే రెండేళ్ల‌లో ఆస్తి కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నా ద్ర‌వ్యోల్భ‌ణం లెక్కించాల్సిన అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు. అని సెబీ-ఆర్‌ఐఏ పర్సనల్ ఫైనాన్స్‌ప్లాన్ వ్యవస్థాపకుడు దీపేశ్ రాఘా అన్నారు.

ద్రవ్యోల్బణ రేటును నిర్ణయించడానికి పెట్టుబడిదారుని జీవనశైలిని చూడ‌ట‌మూ ముఖ్య‌మేన‌ని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం, ప్రయాణాలు, విశ్రాంతి కార్యకలాపాలు, హై-ఎండ్ గాడ్జెట్ల వాడ‌కం, డిజైనర్ బట్టలు, వస్తువులు మొదలైన వాటి కోసం చేసే ఖర్చులను లెక్కించాలి. " గత రెండు-మూడు సంవత్సరాల‌ ఖ‌ర్చులో ఎంత శాతం పెరుగుదల న‌మోదైందో చూడాలి. " అని అరవింద్ రావు & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, చార్టర్డ్ అకౌంటెంట్ అరవింద్ రావు అన్నారు. 

3. రాబ‌డి శాతం..
మ‌దుప‌రులు.. వారి ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు సాధారణంగా ఈక్వీటీ, డెట్‌ల కాంబినేష‌న్‌లో మ‌దుపు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఈక్వీటీల‌పై 10 నుంచి 12 శాతం రాబ‌డి ఉంటుంద‌ని చాలామంది స‌ల‌హాదారులు అంచ‌నా వేస్తారు. దీర్ఘ‌కాలిక‌ మూలధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తిస్తున్నందున ఈక్వీటీల‌పై రాబ‌డి రేటు 9శాతం వ‌ర‌కు ఉండ‌చ్చు. అలాగే లక్ష్యానికి ద‌గ్గ‌ర‌వుతున్న కొద్ది ఈక్వీటీ కేటాయింపు త‌గ్గుతుంది. అని సెబీ-ఆర్‌ఐఏ, ఫిన్విన్ ఫైనాన్షియల్ ప్లానర్స్ మేనేజింగ్ పార్ట‌న‌ర్‌ మెల్విన్ జోసెఫ్ అన్నారు.

డెట్ పెట్టుబుడుల‌లో వివిధ వ‌ర్గాల‌కు చెందిన మ్యూచువ‌ల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రావిడెండ్ మొద‌లైన‌వి ఉంటాయి. ప్ర‌స్తుతం వ‌డ్డీ రేట్ల ప్ర‌కారం చూస్తే, డెట్ పోర్ట్‌ఫోలియోలో 6శాతం రాబ‌డి ఉంటుంద‌ని చాలామంది ప్లాన‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. 

4. ఆయుర్దాయం..
పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఎక్కువ కాలం జీవిస్తారని అనుకుంటే, పదవీ విరమణ కోసం మీకు ఎక్కువ కార్పస్ అవసరం.

"జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో స‌గ‌టు వ్య‌క్తి ఆయుర్ధాయం 69 సంవ‌త్స‌రాలు. అయితే గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో నివ‌సించే వారితో పోలిస్తే, మెట్రో న‌గ‌రాల‌లో వైద్య మౌళిక స‌దుపాయాలు చాలామందికి అందుబాటులో ఉన్నాయి. అందువ‌ల్ల క‌నీసం 85 సంవ‌త్స‌రాల ఆయుర్ధాయం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తాము అని జోసెఫ్ అన్నారు. 

85-90 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని లెక్క‌లోకి తీసుకునేందుకు స‌ల‌హాదారులు ప్రాధాన్య‌త ఇస్తారు. తద్వారా విశ్రాంతి తీసుకునే స‌మ‌యంలో కూడ‌బెట్టిన నిధితో సంతోషంగా గ‌డిపేందుకు వీల‌వుతుంది.

5. ఆదాయం వృద్ధి రేటు..
క్లెయింట్ ఆదాయం ప్ర‌తీ సంవ‌త్స‌రం ఎంత శాతం పెరుగుతుంది అని అంచనా వేసి చెప్ప‌టం ఆర్థిక స‌ల‌హాదారుల‌కు కూడా కొంచెం క‌ష్ట‌మే. ఇది ఒక సంస్థ నుంచి మ‌రొక సంస్థ‌కు వేరుగా ఉంటుంది.  ఉద్యోగి ప‌నితీరు, సీనియారిటీ వంటి వేరు వేరు అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.  చాలా వ‌ర‌కు స‌ల‌హాదారులు ఉద్యోగి అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ది రేటును అంచనా వేస్తారు. 

చివ‌రిగా..
ఆర్థిక ప్ర‌ణాళిక చేసేప్పుడు పైన చెప్పిన అన్ని అంశాల‌ను దృష్టిలో పెట్టుకోవాలి. అంచ‌నా వేయ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. ప్ర‌తీ నిపుణుడు వారి అనుభ‌వాల ఆధారంగా అంచ‌నా వేస్తుంటారు. అదేవిధంగా మీ పూర్వ అనుభ‌వాన్ని బ‌ట్టి, మారుతున్న ప‌రిస్థితుల‌ ఆధారంగా మీరు అంచ‌నా వేయ‌చ్చు. ప్లాన్ చేయ‌డం ఎంత ముఖ్య‌మో.. దానిని అమ‌లు ప‌ర‌చ‌డం కూడా అంతే ముఖ్యమ‌ని గుర్తుంచుకోండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని