త్వరలో ఎల్‌జీ మొబైల్స్‌ కనుమరుగు..! - LG Becomes First Major Smartphone Brand to Withdraw From Market Due to Losses
close

Updated : 05/04/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో ఎల్‌జీ మొబైల్స్‌ కనుమరుగు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణకొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం మొబైల్‌ ఫోన్ల విభాగం నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ విభాగం కంపెనీకి భారీగా నష్టాలను మూటగట్టింది. స్మార్ట్‌ఫోన్ల వ్యాపారం నుంచి వైదొలుగుతున్న తొలి అతిపెద్ద సంస్థగా ఎల్జీ నిలిచింది. ఉత్తర అమెరికా దేశాల్లో ఇప్పటికీ ఈ బ్రాండ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. అక్కడ విక్రయాల పరంగా తొలి ఐదు సంస్థల్లో స్థానం సంపాదించుకుంది. కానీ, ఇతర దేశాల్లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. విపరీతమైన పోటీ కారణంగా గత ఆరేళ్ల నుంచి మొత్తం 4.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకొంది. దీంతో ఈ విభాగాన్ని వదిలేసి ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న విద్యుత్తు వాహనాల పరికరాలు, స్మార్ట్‌హోమ్స్‌పై దృష్టిపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

పలు సరికొత్త ఫీచర్లు పరిచయం చేసి..

సెల్‌ఫోన్లలో పలు కొత్త ఫీచర్లను తెచ్చిన ఘనత ఎల్జీ మొబైల్స్‌కు దక్కింది. అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను  పరిచయం చేసింది. 2013లో విక్రయాల పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. దీనికి ముందు శామ్‌సంగ్‌,యాపిల్‌ ఉన్నాయి.  కానీ, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సమస్యలకుతోడు అప్‌డేట్స్‌‌ నెమ్మదించాయి. ఫలితంగా క్రమంగా విక్రయాలు పడిపోతూ వచ్చాయి.  ప్రపంచ మార్కెట్లో కేవలం 2శాతం వాటా మాత్రమే ఎల్‌జీకి దక్కింది. గతేడాది ఈ కంపెనీ 2.3 కోట్ల ఫోన్లను మాత్రమే విక్రయించింది. అదే సమయంలో శామ్‌సంగ్‌ 25.6 కోట్ల ఫోన్లను అమ్మింది. 

సంస్థ పై ప్రభావం..

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌లో దిగ్గజం. ఈ సంస్థకు ఉన్న వ్యాపారాల్లో మొబైల్స్‌ విభాగమే అతి చిన్నది. సంస్థ మొత్తం ఆదాయంలో దీని వాటా కేవలం 7శాతం మాత్రమే. దీనిని జులై31నాటికి పూర్తిగా మూసివేయవచ్చు. ఈ విభాగంలోని ఉద్యోగులను ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలోకి బదిలి చేస్తారని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఎల్‌జీ ఫోన్ల వినియోగదారులకు ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా కొంతకాలం సర్వీస్‌ సపోర్ట్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను అందజేయనుంది. ప్రాంతాలను బట్టి దీనికి కాలపరిమితి ఉంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని