LIC IPO: ఐపీఓ కోసం నవంబరులో ఎల్‌ఐసీ దరఖాస్తు? - LIC May File papers at sebi for IPO in Nov
close

Updated : 03/10/2021 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LIC IPO: ఐపీఓ కోసం నవంబరులో ఎల్‌ఐసీ దరఖాస్తు?

దిల్లీ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. వచ్చే నెలలో ఐపీఓకి సంబంధించిన ప్రాథమిక పత్రాలను మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి సమర్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆర్థికశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీని ఐపీఓకి తీసుకురావాలన్న లక్ష్యం తమ ముందుందన్నారు. అందుకు నిర్దిష్టమైన కాలపరిమితులు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే నవంబరులో సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నామన్నారు.

ఐపీఓకి వీలుగా ఇప్పటికే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిబంధనలు-1956కు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్‌ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనున్నారు. దీంతోపాటు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించారు. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లకు బదులుగా 62 ఏళ్లకు పెంచారు. మరవైపు ఐపీఓ నిర్వహణకు 10 మర్చంట్‌ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎంపిక చేసింది. ఇందులో గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీ గ్రూప్‌, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ క్యాప్స్‌ ఉన్నాయి. ఎంపికైన మిగతా బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, నొమురా, బోఫా సెక్యూరిటీస్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు ఉన్నాయని సమాచారం. సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ను న్యాయ సలహాదారుగా నియమించారు.

మరోవైపు విదేశీ మదుపర్లను కూడా ఐపీఓలో పాల్గొనేందుకు అనుమతించే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. సెబీ నిబంధనల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ) ఐపీఓ ద్వారా షేర్లు కొనేందుకు అర్హులు. అయితే, ఎల్‌ఐసీ చట్టంలో మాత్రం విదేశీ పెట్టుబడులకు అనుమతి లేదు. ఈ చిక్కు ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరేందుకు ఎల్‌ఐసీ ఐపీఓని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా రూ.25,000 కోట్లను సమీకరించేందుకు రూ.10 ముఖ విలువతో 2,500 కోట్ల షేర్లను జారీ చేసేందుకు ఎల్‌ఐసీ సిద్ధముతున్నట్లు సమాచారం. ఒకసారి మార్కెట్లో లిస్టింగ్‌ అయిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల విలువతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా ఎల్‌ఐసీ అతి పెద్ద కంపెనీగా నిలవనుంది. ఈ సంస్థ నిర్వహణలో రూ.31.96 లక్షల కోట్ల ఆస్తులున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని