Loan Apps: యాప్‌ల నుంచి రుణం తీసుకుంటున్నారా?అవి సురక్షితమైనవేనా? - Lending from loan apps aware of these things First
close

Published : 03/08/2021 11:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Loan Apps: యాప్‌ల నుంచి రుణం తీసుకుంటున్నారా?అవి సురక్షితమైనవేనా?

కరోనా సంక్షోభ సమయంలో వేతన జీవులు సహా.. అనేక మంది సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన వారు.. ఇంటి కనీస అవసరాలను కూడా తీర్చలేని దుస్థితికి చేరారు. దీంతో చాలా మంది సత్వరమే రుణం అందించే యాప్‌లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రజల్ని మోసం చేసే అనేక నకిలీ యాప్‌లు పుట్టుకొచ్చాయి. పైగా సైబర్‌ నేరగాళ్లు  దీన్ని అదునుగా భావించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సరైన యాప్‌ను గుర్తించడం ఎలాగో చూద్దాం..!

సంస్థ వివరాలను పరిశీలించండి..

యాప్‌ ద్వారా రుణం అందిస్తున్న సంస్థ వివరాలను నిశితంగా పరిశీలించండి. ఆర్‌బీఐ నుంచి వారికి అనుమతి ఉందో.. లేదో.. ధ్రువీకరించుకోండి. అది బ్యాంకా లేక ఎన్‌బీఎఫ్‌సీయా తెలుసుకోండి. గతంలో వాటి నుంచి రుణాలు తీసుకున్న వారు రేటింగ్స్‌, ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చి ఉంటారు. వాటిని పరిశీలించండి. వీలైతే వారిని నేరుగా లేదా ఫోన్‌లోనైనా సంప్రదిస్తే ఇంకా మంచిది. వారికి యాప్‌.. దాని ద్వారా రుణం అందిస్తున్నవారి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

రుణదాతల వెబ్‌సైట్‌ సురక్షితమైందేనా?

రుణం తీసుకునే ముందు ఆయా సంస్థల వెబ్‌సైట్లను సందర్శించండి. అవి సురక్షితమేనా.. కాదా.. సరిచూసుకోండి. మీ వ్యక్తిగత సమాచారం అడుగుతున్న పేజీలకు ప్యాడ్‌లాక్‌ ఐకాన్‌ ఉందో..లేదో.. గమనించండి. లేదంటే.. అనుమానించాల్సిందే. అలాగే ‘హెచ్‌టీటీపీ’ వెబ్‌సైట్లు సురక్షితమైనవని గుర్తుంచుకోవాలి. నిజమైన సంస్థలైతే రుణగ్రహీతల సమాచారాన్ని భద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటాయి.

కార్యాలయం.. చిరునామా..

మీకు యాప్‌ ద్వారా రుణం అందజేస్తున్న సంస్థలకు భౌతికంగా ఒక కార్యాలయం అంటూ ఉందో.. లేదో.. తెలుసుకోవాలి. కచ్చితంగా వాటికి ఒక చిరునామా ఉండాలి. ఒకవేళ అలాంటి వివరాలేవీ మీకు అందుబాటులో లేకపోతే.. అలాంటి వాటి నుంచి రుణం తీసుకోకపోవడమే మంచిది. నకిలీ సంస్థలైతే.. స్కామ్‌ బయటపడ్డ తర్వాత తప్పించుకోవడానికి ఎలాంటి కార్యాలయం నెలకొల్పకపోవచ్చు. కాబట్టి ముందే జాగ్రత్త పడాలి.

ముందస్తు ఫీజు..

కొన్ని యాప్‌లు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాయి. అంటే నిజానికి అవి ఎలాంటి రుణం అందజేయవు. కానీ, కొంత ముందస్తు ఫీజు వసూలు చేసి అసలు రుణాలిచ్చే సంస్థలకు రీడైరెక్ట్‌ చేస్తుంటాయి. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకు వీటి నుంచి రుణం తీసుకోకపోవడమే మంచిది. అసలు రుణాలిచ్చే యాప్‌లు లేదా వెబ్‌సైట్లకు రీడైరెక్ట్‌ చేయడం వరకే వీరి పని. తర్వాత ఎలాంటి బాధ్యత వహించరు.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నిబంధనలు..

మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ నిబంధనల ప్రకారం ఉందో.. లేదో.. సరిచూసుకోవాలి. 60 రోజుల కంటే తక్కువ కాలపరిమితితో కూడిన రుణాలిచ్చే యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ అనుమతించదు.

ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న వారికి రుణ యాప్‌లు ఓ మంచి అవకాశమనే చెప్పాలి. కానీ, నకిలీ వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఆర్థిక అంశాలపై అవగాహనతో పాటు డిజిటల్‌ అంశాలపై కూడా కొంత పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ ధ్రువీకరించిన వనరుల నుంచే రుణాలు తీసుకుంటే మరీ మంచిది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని