కొవిడ్‌ భయం..కొత్త పాలసీలు జూమ్‌ - Life insurance cos see 21 pc rise in new business premium
close

Updated : 10/03/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ భయం..కొత్త పాలసీలు జూమ్‌

 21 శాతం వృద్ధి.. ఎల్‌ఐసీదే అగ్రస్థానం

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి తర్వాత జీవిత బీమాపై అవగాహన పెంచుకోవడంతో పాటు కొత్తగా పాలసీలు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. 24 జీవిత బీమా సంస్థలకూ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ప్రీమియం వసూళ్లు 21శాతం పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరాయి. 2020 ఫిబ్రవరిలో ఇలా వసూలైన రూ.18,533.19 కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం అధికం. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ రూ.12,920.57 కోట్ల తొలి ప్రీమియాన్ని వసూలు చేసి, అగ్రస్థానంలో నిలిచింది. 2020 ఇదేనెల ప్రీమియం రూ.10,404.68 కోట్లతో పోలిస్తే.. 24.18శాతం వృద్ధి లభించింది. మిగతా 23 బీమా సంస్థలూ కలిసి రూ.9,504.64 కోట్లు వసూలు చేశాయి. 2020 ఫిబ్రవరిలో ఇవన్నీ కలిపి వసూలు చేసిన రూ.8,128.51 కోట్లతో పోలిస్తే ఇది 16.93% అధికం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ రూ.1,895.94 కోట్లు, ఎస్‌బీఐ లైఫ్‌ రూ.1,750.73 కోట్లు వసూలు చేశాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ 19% క్షీణతతో రూ.1,737.03 కోట్లకు పరిమితమైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ల వల్ల జీవిత బీమా తొలి ప్రీమియం వసూళ్లు 18.5శాతం క్షీణించాయి. ఆంక్షలు సడలించాక కొంత వృద్ధి కనిపించింది. ఆర్థిక సంవత్సరం ముగియబోతున్న నేపథ్యంలో బీమా సంస్థలు పాలసీలు విక్రయించేందుకు పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రీమియం వసూళ్లు పెరిగాయి. అయినప్పటికీ.. 2019-20 ఏప్రిల్‌-ఫిబ్రవరితో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో తొలి ప్రీమియం వసూళ్లలో 0.6శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.34లక్షల కోట్లు వసూలు కాగా.. ప్రైవేటు బీమా సంస్థలన్నీ కలిపి 9శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎల్‌ఐసీ ఇంకా మూడు శాతం తక్కువ వృద్ధితోనే ఉంది.

పెరిగిన బీమా షేర్లు..

ప్రీమియం వసూళ్లలో వృద్ధి నమోదైన నేపథ్యంలో మంగళవారం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరు 5.19% పెరిగి, రూ.971.85కు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 2.18% పెరిగి రూ.739.80, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 1.82% పెరిగి రూ.487.90 దగ్గర ముగిశాయి.

ఇవీ చదవండి...

మహిళలకు బీమా సంస్థలు అందించే ప్ర‌త్యేక‌ ప్రయోజనాలు

బీమా సంస్థ‌ల‌కు ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధ‌న‌లు 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని