తొలిరోజే దుమ్ము రేపిన ఎమ్‌టార్‌ టెక్ ఐపీవో! - MTAR Tech IPO oversubscribed Within Hours
close

Updated : 03/03/2021 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలిరోజే దుమ్ము రేపిన ఎమ్‌టార్‌ టెక్ ఐపీవో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎమ్‌టార్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తొలిరోజే దుమ్ము రేపింది. ఐపీవో ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఈ కంపెనీ షేర్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం. ఈ ఆఫర్‌లో 72.60 లక్షల షేర్లు ఇష్యూలో ఉండగా.. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికే 91 లక్షల షేర్లకు బిడ్లు అందాయి. రిటైల్‌ విభాగంలో ఈ కంపెనీ షేర్లు ఇప్పటికే 1.75 శాతం ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌లో మంచి అనుభవం ఉన్న ఈ సంస్థ షేర్లకు భారీ డిమాండ్‌ లభిస్తోంది. అణు రియాక్టర్లు‌, ఏరోస్పేస్‌ ఇంజిన్లు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధ విమానాల్లో వినియోగించే కీలక విడిభాగాలను తయారు చేయడంలో ఈ కంపెనీ పేరుగాంచింది. నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన ఈ కంపెనీ క్రమంగా తమ ఉత్పత్తులను వివిధ రంగాలకు విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కంపెనీ నేపథ్యం, ఐపీవోకు సంబంధించిన కీలక వివరాలను పరిశీలిద్దాం..!

ఇష్యూలో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగిన 1,22,24,270 షేర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 40 లక్షల షేర్లు తాజావి కాగా..  మిగిలినవి ప్రమోటర్ల వాటాలు.  వీటిని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. ఈ ఐపీవో ద్వారా దాదాపు రూ.600-650 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 15 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.178.92 కోట్లు సమీకరించింది. దీంతో ఈ నెల 2న రూ.575 ధర వద్ద 31,11,725 షేర్లను ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో నొమురా ఫండ్స్‌ ఐర్లాండ్‌, జూపిటర్‌ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్‌, వైట్‌ ఓక్‌ కేపిటల్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ ఇండియా తదితర విదేశీ ఫండ్లు ఉన్నాయి. దేశీయ సంస్థలైన ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.70 కోట్లు, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టాయి. 

ఈ ఐపీవోకి సంబంధించిన కీలక విషయాలు...

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: మార్చి 03, 2021
ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: మార్చి 05, 2021
బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: మార్చి 10, 2021
రీఫండ్‌ ప్రారంభ తేదీ: మార్చి 12, 2021
డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: మార్చి 15, 2021
మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: మార్చి 16, 2021

ముఖ విలువ: రూ.10(ఒక్కో ఈక్విటీ షేరుకు)
లాట్‌ సైజు: 26 షేర్లు
కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: ఒక లాట్‌
గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 388
ఐపీవో ధర శ్రేణి: రూ.574 నుంచి రూ.575 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

సంస్థ ఇతర వివరాలు...

నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన ఎమ్‌టార్‌ టెక్నాలజీస్‌... ఇస్రో, డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్‌, బీడీఎల్‌, బార్క్‌ వంటి ప్రముఖ సంస్థలకు సరఫరాదారుగా ఉంది. అలాగే దేశంలో అణు రియాక్టర్ల స్థాపనలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాకు చెందిన బ్లూమ్‌ ఎనర్జీ ఈ సంస్థ క్లైంట్‌గా ఉండడం విశేషం. పీఎస్‌ఎల్‌వీ-సీ25, పీఎస్‌ఎల్‌వీ-సీ49, మంగళయాన్‌, చంద్రయాన్‌ తదితర ప్రముఖ మిషన్లలో వాహక నౌకలకు ఈ కంపెనీ లిక్విడ్‌ ప్రొపల్షన్‌ ఇంజన్లను సరఫరా చేసింది. 2020 నవంబరు 30 నాటికి కంపెనీ చేతిలో రూ.356.50 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.

ఇవీ చదవండి...

అగ్ర స్థానం నుంచి ‘మా’యం..!

సార్వభౌమ ప‌సిడి బాండ్ల‌పై ప‌న్ను ఎప్పుడు వ‌ర్తిస్తుంది


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని