close

Updated : 01/03/2021 10:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుల్‌కు జీడీపీ కిక్కు..!

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉత్సాహకరమైన సంకేతాలు అందుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో గతవారపు భారీ నష్టాల నుంచి మార్కెట్లు కోలుకున్నట్లైంది. సెన్సెక్స్‌ 49,747 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 14,702 వద్ద ఆరంభమైంది. ఉదయం 9:39 గంటల సమయానికి సెన్సెక్స్‌ 667 పాయింట్ల ఎగబాకి 49,767 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 176 పాయింట్లు పెరిగి 14,705 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.70 వద్ద కొనసాగుతోంది.

వరుసగా రెండు త్రైమాసికాల జీడీపీ వృద్ధిరేటు ప్రతికూలంగా నమోదు కావడంతో ఏర్పడిన సాంకేతిక మాంద్యం నుంచి భారత్‌ బయటపడిందంటూ శుక్రవారం వెలువడిన జాతీయ గణాంక కార్యాలయం నివేదిక మదుపర్లలో ఉత్సాహం నింపింది. అక్టోబరు-డిసెంబరులో + 0.4 శాతం మేర వృద్ధి సాధించడంతో భారత్‌ మూడో త్రైమాసికంలో మాద్యం నుంచి బయటపడిన అతికొద్ది ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం విశేషం. ఇక బాండ్ల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలు సోమవారం నాటికి కాస్త చల్లబడడంతో ఆసియా దేశాల సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అలాగే ఒకే డోసు టీకా అయిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సరఫరా ప్రారంభం కావడం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది. మరోవైపు జపాన్‌లో పారిశ్రామికోత్పత్తి రెండేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం విశేషం. అలాగే అమెరికాలో కరోనా ఉద్దీపన పథకం ఆమోద ప్రక్రియలో పురోగతి కనిపించడం మార్కెట్లకు సానుకూలాంశం. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, ఐటీ, ఇన్‌ఫ్రా, యుటిలిటీస్‌ రంగాలు దాదాపు రెండు శాతం మేర లాభాల్లో ఉన్నాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని