మార్కెట్లను ముంచిన కరోనా భయాలు! - Markets are in deep red
close

Published : 05/04/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లను ముంచిన కరోనా భయాలు!

ముంబయి: దేశంలో మరోసారి కరోనా వైరస్‌ భారీ స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్నకొద్దీ అంతకంతకూ దిగజారాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ప్రతికూలంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 1,449 పాయింట్లు కుంగి 48,580 వద్ద.. నిఫ్టీ 408 పాయింట్లు కోల్పోయి 14,459 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువలో దాదాపు రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిష్ఠాల నుంచి సూచీలు కోలుకున్నప్పటికీ.. లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 870 పాయింట్ల నష్టంతో 49,159 వద్ద... నిఫ్టీ 229 పాయింట్లు కోల్పోయి 14,637 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.33 వద్ద స్థిరపడింది.

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. విప్రో, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 

నేడు విడుదలైన కరోనా కేసుల సంఖ్య మదుపర్ల సెంటిమెంటును పూర్తిగా దెబ్బతీసింది. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంతగా రోజువారీ కేసులు నేడు లక్షకు పైగా నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో ఉండగా.. ఇప్పుడు భారత్‌ రెండో స్థానానికి చేరింది. ఈ వార్తలు సూచీలను ఉదయం మరింత కిందకు దిగజార్చాయి. ఐటీ రంగ షేర్లు రాణించడంతో ఒకింత నష్టాలు కట్టడి అయ్యాయని చెప్పొచ్చు. కరోనా కేసుల కట్టడి కోసం దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు మరోసారి అమలులోకి రావొచ్చన్న అనుమానాలు సూచీలపై ప్రభావం చూపింది ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతంలో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు తాజాగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల రూపంలో ఆర్థిక వ్యవస్థకు మరో సవాల్‌ ఎదురవనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో ఆర్‌బీఐ సర్దుబాటు ధోరణి కొనసాగిస్తూనే కీలక రేట్లలో మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. దేశంలో కొవిడ్‌-19 కేసుల పెరుగుదల ఆర్థిక రికవరీకి అడ్డుకట్ట వేసి.. ద్రవ్యోల్బణ రేటు పెరిగేందుకు కారణమవ్వొచ్చన్న అంచనాలూ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు ఈవారం వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై దృష్టి సారించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని